అదృశ్యమై..బావిలో శవమై తేలాడు

The Boy Found Dead In  Well Who Disappeared In Mangalagiri Town - Sakshi

సాక్షి, మంగళగిరి : రెండు రోజుల కిందట మంగళగిరి పట్టణంలో అదృశ్యమైన బాలుడు మంగళవారం బావిలో శవమై కనిపించాడు. ఎక్కడో ఓ చోట ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా బాలుడు శవమై కనిపించడంతో, వారి రోదనకు అంతులేకుండాపోయింది. బావిలో శవమై తేలిన బాలుడ్ని చూసి స్థానికులు సైతం కన్నీరుమున్నీరైన సంఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పట్టణ పరిధిలోని ఎన్‌సీసీ రోడ్డు జండా చెట్టు వద్ద నివాసం ఉంటున్న శంకరరావు, తన కుమారుడు కొల్లి వాసు (7) కనిపించడం లేదంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు.

పట్టణ పరిధిలోను, పరిసర ప్రాంతాలు, తమ బంధువులు ఉన్న ఊర్లలో విచారించినా ఎక్కడా కనపడకపోవడంతో ఇంటికి వస్తాడన్న ఆశతో ఎదురుచూసాడు. అయితే మంగళవారం ఉదయం పాత మంగళగిరి మునసబ్‌ గారి మిల్లు వెనుక ఉన్న నేలబావిలో ఓ బాలుడు శవమై ఉన్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై భార్గవ్‌ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతి చెందిన బాలుడు రెండు రోజుల కిందట అదృశ్యమైన కొల్లి వాసుగా గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

బావి దగ్గరకు చేరుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమై ఉండటంతో కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సహాయంతో పోలీసులు బాలుడ్ని బావిలోనుంచి బయటకు తీశారు. అప్పటికే మూడు రోజులు అవ్వడంతో మృతదేహం బాగా ఉబ్బిపోయి, దుర్వాసన వెదజల్లుతుంది. అయితే ఆదివారమే ఆ బావిలో ప్రమాదవశాత్తు జారి పడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రతిరోజూ బావి ఉన్న మైదానంలో పిల్లలు క్రికెట్, ఇతర ఆటలు ఆడుకుంటుంటారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ ఆడుకుంటున్న వారికి కనబడ్డాడని, ఆ తర్వాతే ప్రమాదవశాత్తు జారి పడి ఉండవచ్చని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన నేలబావి 
పాత మంగళగిరి మునసబ్‌గారి మిల్లు వెనుక ఉన్న మైదానంలో ఎన్నో సంవత్సరాలుగా నేలబావి ఉంది. ఈ నేలబావి ఎవరూ వాడకపోవడంతో చెత్తాచెదారంతో నిండి ఉంది. కనీసం దాని చుట్టూ గోడకాని, ఎలాంటి రక్షణ వలయం కాని లేకపోవడంతో ప్రమాదాలకు నిలయమైంది. 15 రోజుల కిందట కూడా ఒక బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి నేలబావిలో పడిపోయాడు.

అక్కడే పక్కనే పనిచేస్తున్న తాపీ పనివాళ్లు గమనించి వెంటనే బావిలోనుంచి పిల్లవాడిని రక్షించి ప్రాణాలను కాపాడారు. ఉపయోగంలో లేని ఈ నేలబావిని మూసివేయాలని, లేదా కనీసం బావిచుట్టూ రక్షణ వలయాలనన్నా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ఇలా ప్రమాదాల బారిన పడి ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top