అమాయకులపై కేసులు పెట్టం

Attack On Avro Police Station Case Nellore - Sakshi

రాపూరు (నెల్లూరు): రాపూరు పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించి అమాయకులపై కేసులు పెట్టమని జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృçష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నిర్దోషులపై కేసులు పెట్టమని, ఎవరూ భయపడొద్దన్నారు. దాడి కేసులో 35 మందిని గుర్తించామని, విచారణలో ఇద్దరు లేరని తెలిసి వారి పేర్లు తొలగించినట్లు చెప్పారు. ఇంకా 33 మంది ఉన్నారని, వారిలో ఇప్పటికే 22 మందిని అరెస్ట్‌ చేసి కోర్టుకు హజరుపరిచామన్నారు. మిగిలిన 11 మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు. దాడికేసులో ఉన్న వారిపేర్లు శాంతి కమిటీకి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రాపూరులో 144 సెక్షన్‌ పెట్టలేదన్నారు. దళితవాడకు వందలమంది పోలీసులు వెళ్లలేదన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని చెప్పారు. వాట్సాప్‌ గ్రూపుల్లో కొందరు అసత్య పోస్టింగ్‌లు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రాపూరు పోలీస్‌స్టేçషన్‌లో మరో ఎస్సైని నియమిస్తామని, అలాగే ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. అంతకుముందు ఆయన ఎస్సై లక్ష్మణ్‌ను, కానిస్టేబుల్‌ను పరామర్శించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాంబాబు, సిబ్బంది ఉన్నారు.
 
జేసీ విచారణ
దాడి కేసుకు సంబంధించి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెట్రిసెల్వి మంగళవారం విచారణ చేపట్టారు. ఆమె తొలుత రాపూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ప్రత్యక్షసాక్షులతో మాట్లాడారు. దాడి ఎందుకు జరిగింది?, దాడికి ముందు జరిగిన పరిణామాలు, తొలుత ఎవరు ఎవరిపై దాడి చేశారు?, తదితర విషయాలను పోలీస్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్‌ను విచారించారు. స్టేషన్‌ బయటకు జేసీ వస్తున్న సమయంలో స్థానికులు రాపూరు ఎస్సైకి మద్దతుగా నినాదాలు చేసి మద్దతు ప్రకటించారు. అనంతరం జేసీ ఎస్సీకాలనీకి చేరుకుని అక్కడి దళిత మహిళలతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. నివేదికను ఆయనకు అందిస్తామని చెప్పారు. జేసీ వెంట ఆర్డీఓ హరిత, డీఎస్పీ రాంబాబు, తహసీల్దార్‌ రమణయ్య, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top