కొంపముంచిన వాట్సప్‌ పోస్టింగ్‌

Anganwadi Worker Suffering Whatsapp Posting In East Godavari - Sakshi

లేని పాపను తీసుకురమ్మంటూ అధికారుల ఒత్తిడి

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

తూర్పుగోదావరి ,కాజులూరు (రామచంద్రపురం): దొంగిలించబడిన పాప తమ వద్ద ఉందని, తల్లిదండ్రులకు తెలిసేలా ఈ విషయాన్ని పది మందికీ పంపాలంటూ వచ్చిన ఓ పోస్టింగ్‌ను ఇతరులకు పంపడమే ఆమె నేరమైంది. ఆకతాయిలు వక్రీకరించి ఇతరులకు పోస్టింగ్‌ పెట్టడంతో లేని పాపను తీసుకు రమ్మంటూ ఇప్పుడు అధికారులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. వివరాల్లోనికి వెళితే గొల్లపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న టి. వరలక్ష్మికి కొన్నిరోజుల క్రితం ఆమె సెల్‌ ఫోన్‌కు ఒక వాట్సప్‌ పోస్టింగ్‌ వచ్చింది. ఐదు నెలల వయసున్న పసిపాపను ఎవరో దొంగిలించి ముష్టి చేస్తుండగా, తాము పట్టుకున్నామని, పాప తమ వద్ద ఉందని, ఈ విషయం పాప తల్లిదండ్రులకు చేరేలా పది మందికీ పోస్టు చెయ్యాలంటూ కింద రెండు సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇస్తూ వాట్సప్‌ పోస్టింగ్‌ వచ్చింది.

ఆమె ఆ పోస్టింగ్‌ను తన సెల్‌ఫోన్‌లో ఉన్న కొందరికి పంపింది. ఆపై ఎవరో ఆకతాయిలు ముష్టిచేస్తున్న వారి నుంచి పట్టుకున్న పాప గొల్లపాలెం అంగన్‌వాడీ టీచరు వరలక్ష్మి వద్ద ఉందంటూ పోస్టింగ్‌కు జతచేస్తూ ఇతరులకు పంపించారు. ఆకతాయిలు పెట్టిన పోస్టింగ్‌ ఒక సెల్‌ ఫోన్‌ నుంచి మరో సెల్‌ఫోన్‌కు వెళుతూ చివరకు జిల్లా అధికారులకు కూడా చేరింది. ఆ పాపను స్వాధీనం చేసుకొమ్మని కలెక్టరేట్‌ నుంచి కాజులూరు తహసీల్దార్‌కు, ఐసీడీఎస్‌ నుంచి అంగన్‌వాడీ సిబ్బందికి ఆదేశాలు అందాయి. దీంతో రెవెన్యూ అధికారులు పాపను అప్పగించాలని అంగన్‌వాడీ టీచరు వరలక్ష్మిని డిమాండ్‌ చేస్తున్నారు. ఎవరో వాట్సప్‌ మెజేస్‌ పెడితే మానవతా దృక్పథంతో తిరిగి ఇతరుకు వాట్సప్‌ చేశానని లేని పాపను తీసుకు రమ్మంటే ఎలా తీసుకురాగలనని వరలక్ష్మి లబోదిబోమంటోంది. జరిగిన ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరలక్ష్మికి వచ్చిన వాట్సప్‌ పోస్టింగ్‌లోని నంబర్లకు ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని గొల్లపాలెం ఎస్సై షేక్‌ జబీర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top