ఇల్లెందు కమిషనర్‌పై దాడి | Sakshi
Sakshi News home page

ఇల్లెందు కమిషనర్‌పై దాడి

Published Tue, Sep 26 2017 8:54 AM

trs leaders attack on illendhu commissioner

ఖమ్మం  ,ఇల్లెందు : అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్మికుల చేత తొలగింపజేసినందుకు ఇల్లెందు మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఫైర్‌ అయ్యారు. ఏకంగా భౌతిక దాడికి దిగారని కమిషనర్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన ఉదయం 8 గంటల మధ్యలో జరగ్గా..సాయంత్రం దాకా..స్థానికంగా రాజకీయ దుమారం నెలకొంది.

అసలేం జరిగిందంటే..
జిల్లా గ్రాంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా ఈ నెల 24వ తేదీన (ఆదివారం) టీఆర్‌ఎస్‌ నాయకులు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి తీసుకోలేదని కమిషనర్‌ తొలగించారు. ఈ ఘటనపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశ్నించగా..నిబంధనల ప్రకారం నడుచుకున్నానని వివరణ ఇచ్చినట్లు కమిషనర్‌ తెలిపారు. సింగరేణి ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ స్పీకర్‌ మహమూద్‌ అలీ ఇల్లెందు పర్యటనకు వస్తుండగా..ఆదివారం అర్ధరాత్రి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సోమవారం ఉదయం మున్సిపల్‌ కార్మికులు తొలగించడంతో గొడవ మొదలైంది.

ఎవరు దాడి చేశారంటే..
కమిషనర్‌ రవిబాబు డీఎస్పీ కార్యాలయం వద్ద, పోలీస్‌ స్టేషన్‌లో, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మడత రమా గృహంలో విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. తాను నివాసముండే సింగరేణి క్వార్టర్‌ ఎదుట కుమారుడిని ఎత్తుకుని ఉండగా సోమవారం ఉదయం 7 తర్వాత టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సిలివేరు సత్యనారాయణ, కౌన్సిలర్‌ జానీపాష, గ్రంథా లయ సంస్థ డైరెక్టర్‌ అక్కిరాజు గణేష్, ఎంపీటీసీ మండల రాము, మాజీ కౌన్సిలర్‌ మధారమ్మ ఒక్కసారిగా అక్కడికి వచ్చి తనపై దాడి చేశారని తెలిపారు. ఇంట్లోకి పరిగెత్తగా అక్కడకూ వచ్చి భార్య ముందు కొట్టారని చెప్పారు. దళితుడిననే ఇలా చేశారని, పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు డబ్బులు కూడా చెల్లించామని, అయినా ఎందుకు తొలగించారని అడిగే క్రమంలో వాగ్వాదం జరిగిందని, తాము దాడి చేయలేదని టీఆర్‌ఎస్‌ నేతలు జానీపాష, సిలివేరు సత్యనారాయణ తెలిపారు. బీజేపీ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.

దాడిని ఖండించిన చైర్‌పర్సన్, కౌన్సిలర్లు
మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుపై దాడి ఘట నను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మడత రమా, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యు లు మడత వెంకట్‌గౌడ్‌ ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు తర్వాత నేరుగా చైర్‌పర్సన్‌ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలను కమిషనర్‌ ఆమెకు వివరించారు. మడత వెంకట్‌గౌడ్‌ జోక్యం చేసుకొని..ఈ సంఘటనలో ఎమ్మెల్యే జోక్యం లేదని, ఆయనను ఇందులోకి లాగొద్దని కమిషనర్‌కు సూచించారు.

మద్దతుగా నిలిచిన విపక్ష నాయకులు..
మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుపై దాడిని నిరశిస్తూ వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కమిషనర్‌ను కలిసిన అఖిలపక్ష పార్టీల నేతలు పరుచూరి వెంకటేశ్వర్లు, ముద్రగఢ వంశీ, బానోతు హరిసింగ్‌నాయక్‌(టీడీపీ), జానీపాష, సుదర్శన్‌కోరీ(కాంగ్రెస్‌), కిరణ్‌(సీపీఎం), బంధం నాగయ్య(సీపీఐ), సంజయ్‌కుమార్‌(వైఎస్సార్‌సీపీ), తుపాకుల నాగేశ్వరరావు(ఎన్డీ) ఎల్‌.రవి(ఎన్డీ–2), మంతెన వసంతరావు(ఎమ్మార్పీఎస్‌) మద్దతు ప్రకటించారు.

Advertisement
Advertisement