నమ్మినవారే వంచించారు..

15 Members In Tenth Class Girl Molestation Case Guntur - Sakshi

బాలికపై అత్యాచారానికి సహకరించిన ముగ్గురు మహిళలు

ఘటనలో మొత్తం 15 మంది దాకా ఉన్నట్లు పోలీసుల అనుమానం

పట్నంబజారు(గుంటూరు): ఆంటీ.. అక్కా.. అని పిలుస్తున్న ఆ బాలికను ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న ముగ్గురు మహిళలు వంచించారు. మృగాళ్లకు సహకరించి బాలికపై సామూహిక అత్యాచారానికి కారకులయ్యారు. గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన పదో తరగతి బాలికపై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. బాలిక ఇంటి పక్కన ఉన్న మహిళలే యువకులకు సహకరించి ఆ బాలికను నమ్మించి వంచించినట్లు తెలుస్తోంది. స్వర్ణభారతినగర్‌కు చెందిన త్రినాథ్‌.. ప్రేమ పేరుతో బాలిక వెంటపడి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గత నెల 29న కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం త్రినాథ్‌ సహా అతని స్నేహితులు ఏలూరి మోహన్‌కృష్ణ, చిన్ని, ఇజ్రాయిల్, వలీ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచార ఘటనలో 15 మంది వరకూ ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటికొస్తున్నట్టు తెలుస్తోంది. త్రినాథ్‌ అతని స్నేహితులకు బాలిక నివాసానికి సమీపంలో ఉండే ముగ్గురు మహిళలు సహకరించినట్టు దర్యాప్తులో బయటపడినట్టు సమాచారం. పోలీసులు ఆ ముగ్గురులో ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాలికపై ఆ యువకులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతుండడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది.

మాయ మాటలు చెబుతూ..  
బాలిక నివాసానికి సమీపంలో ఉండే మహిళ, త్రినాథ్‌ ఇంటి పక్కనే ఉండే మరో మహిళ, అదే ప్రాంతంలో ఉండే ఇంకో మహిళ.. వీరంతా బాలికకు మాయమాటలు చెబుతూ త్రినాథ్‌ వైపు ఆకర్షితురాలయ్యేలా చేసినట్టు సమాచారం. అతని ఉచ్చులో పడిన బాలికను అదే ప్రాంతంలో ఉండే మహిళ 2 రోజుల పాటు నిర్బంధించి.. ఇద్దరు యువకులతో అత్యాచారం చేయించినట్టు సమాచారం. కొన్ని రోజుల తర్వాత వెంగళాయపాలెం కొండల్లోని ఒక స్నేహితుడి గదికి తీసుకెళ్లిన సందర్భంలో వారి నుంచి తప్పించుకుని పారిపోయిన బాలికను ఓ మహిళ కాపాడినట్టు తెలిసింది. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయటంతో పాటు అందుకు సహకరించిన యువకులు, పాఠశాల వద్ద బాలిక కిడ్నాప్‌నకు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top