 
															మొండిబకాయిల సమస్య నుంచి గట్టెక్కినట్టే..చందా కొచర్
దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ మొండి బకాయిల(ఎన్‌పీఏ) గడ్డు పరిస్థితుల నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు.
	ఐసీఐసీఐ సీఈఓ, ఎండీ చందా కొచర్
	
	ముంబై: దేశీ బ్యాంకింగ్ పరిశ్రమ మొండి బకాయిల(ఎన్‌పీఏ) గడ్డు పరిస్థితుల నుంచి దాదాపు గట్టెక్కినట్లేనని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలికాలంలో బ్యాం కుల ఎన్‌పీఏలు ఎగబాకడం తీవ్ర ఆందోళనకలిగిస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
	
	ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా మొండిబకాయిలు, రుణాల పునర్‌వ్యవస్థీకరణలు కొంత పెరిగే అవకాశం ఉందని.. అయితే, క్రితం ఏడాది స్థాయిలో ఉండకపోవచ్చని కొచర్ పేర్కొన్నారు. కార్పొరేట్ రంగంలో ప్రాజెక్టులకు ఇక వేగంగా అనుమతులు లభిస్తాయని భావిస్తున్నామని.. నగదు ప్రవాహంలో ఏవైనా ఒత్తిడి ఉంటే తొలగించాల్సిన అవసరం ఉంద న్నారు.
	 
	దేశీ బ్యాంకింగ్ వ్యవస్థకు తక్షణ సమస్య ఎన్‌పీఏల పెరుగుదలేనంటూ తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్  ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. కాగా, తమ బీమా యూనిట్లకు(ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్)  సరైన విలువ లభిస్తుందన్న విశ్వాసంవస్తే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని కొచర్ పేర్కొన్నారు. తక్షణం తమ అనుబంద సంస్థల లిస్టింగ్ యోచనేదీ లేదని తేల్చిచెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
