విప్రో 1:1 బోనస్‌ షేర్లు | Sakshi
Sakshi News home page

విప్రో 1:1 బోనస్‌ షేర్లు

Published Wed, Apr 26 2017 12:50 AM

విప్రో 1:1 బోనస్‌ షేర్లు

స్వల్పంగా పెరిగిన లాభం  
క్యూ4లో రూ. 2,267 కోట్లు


బెంగళూరు: దేశీయంగా మూడో అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 2,267 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో సంస్థ లాభం రూ. 2,257 కోట్లు. ఇక మొత్తం ఆదాయం సుమారు 5 శాతం వృద్ధితో రూ. 14,313 కోట్ల నుంచి రూ. 15,034 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా.. వచ్చే రెండు నెలల్లో బోనస్‌ షేర్లు జారీ చేయనున్నట్లు విప్రో ప్రకటించింది.

 పోటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ తమ షేర్‌హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇప్పటికే భారీ బైబ్యాక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనున్నట్లు విప్రో పేర్కొంది. చిన్న ఇన్వెస్టర్లకు  భాగస్వామ్యం కల్పించేందుకు, లిక్విడిటీని పెంచేందుకు, రిటైల్‌ షేర్‌హోల్డర్ల పరిమాణాన్ని పెంచేందుకు ఇది తోడ్పడనున్నట్లు తెలిపింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 5% డౌన్‌ ...
మరోవైపు, మార్చి 2017తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను విప్రో నికర లాభం సుమారు 5 శాతం క్షీణించి రూ. 8,518 కోట్లుగా నమోదైంది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం 7.4 శాతం పెరి?గ రూ. 57,995 కోట్లకు చేరింది. ఏప్రిల్‌ – జూన్‌ 2017 త్రైమాసికంలో తమ ఐటీ సర్వీసుల వ్యాపార విభాగం ఆదాయాలు 1,915–1,955 మిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో పేర్కొంది. విప్రో వ్యాపారంలో ఐటీ సర్వీసుల విభాగానికి సింహభాగం వాటా ఉంటుంది. మార్చి క్వార్టర్‌లో ఇది 3.9 శాతం పెరుగుదలతో 1,957 కోట్లకు చేరింది. ఇక, ఐటీ సేవల ఆదాయాలు 4.9 శాతం వృద్ధితో 7.7 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  

అమెరికాలో స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు ..
వీసా నిబంధనలు కఠినతరం అయిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి అమెరికాలో తమ ఉద్యోగుల్లో సగభాగం పైగా స్థానికులే ఉండగలరని విప్రో సీఈవో ఆబిదాలి జెడ్‌ నీముచ్‌వాలా పేర్కొన్నారు. అమెరికాలో నియామకాలు, డెలివరీ సెంటర్స్‌ ఏర్పాటు మొదలైన కార్యకలాపాలపై గణనీయంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని చెప్పారు. కాలిఫోర్నియా, మిషిగన్‌Sలో కొత్తగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో విప్రో 7.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించగా అందులో 54 శాతం అమెరికా మార్కెట్ల నుంచే వచ్చింది.

ఇక జూలై 31 నుంచి మరో రెండేళ్ల పాటు అజీం ప్రేమ్‌జీనే చైర్మన్, ఎండీగా కొనసాగించే ప్రతిపాదనను విప్రో బోర్డు ఆమోదించింది. అలాగే, అదనంగా 258.25 కోట్ల షేర్లను సృష్టించడం ద్వారా ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌ను రూ. 610 కోట్ల నుంచి రూ. 1,126.5 కోట్లకు పెంచే అంశానికీ ఆమోదముద్ర వేసింది.  బైబ్యాక్‌ యోచన..: ప్రతిపాదిత బోనస్‌ షేర్లను జూన్‌ 24 నాటికల్లా కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 మరోవైపు, షేర్లను బైబ్యాక్‌ చేయాలని కూడా విప్రో యోచిస్తోంది. జూలైలో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఈ ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉందని జతిన్‌ దలాల్‌ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో విప్రో సుమారు రూ. 2,500 కోట్లతో 4 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసింది.మంగళవారం బీఎస్‌ఈలో విప్రో షేరు స్వల్ప లాభంతో రూ. 494.55 వద్ద ముగిసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement