బీమా కవరేజీ ఎంత ఉండాలి..

What should be insurance coverage? - Sakshi

అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ సంస్థ స్విస్‌ ఆర్‌ఈ 2015లో రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌లో సగటు జీవిత బీమా కవరేజీ ప్రామాణిక స్థాయి కన్నా 92 శాతం మేర తక్కువగా ఉంది. మరో రకంగా చెప్పాలంటే రూ. 100 మేర బీమా కవరేజీ అవసర మైతే.. తీసుకునే కవరేజీ రూ. 7.8 మాత్రమే ఉంటోంది. అంటే అవసరమైనదానికి, తీసుకుంటున్న కవరేజీకి మధ్య ఏకంగా 92.2 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రామాణికంగా తీసుకోదగిన జీవిత బీమా కవరేజీ ఎంత అన్నది తెలియజేసేదే ఈ కథనం.

ప్రస్తుత జీవన ప్రమాణాలతో కుటుంబ నిర్వహణకు ఎంత జీవిత బీమా కవరేజీ అవసరం అన్నది తెలుసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. రూ. 50 లక్షల జీవిత బీమా డబ్బుని ఫిక్సిడ్‌ డిపాజిట్‌ వంటి సురక్షిత సాధనంలో 6 శాతం వడ్డీ రేటుకు (దీర్ఘకాలిక) ఉంచితే.. నెలవారీగా రూ. 25,000 వస్తాయనుకుందాం. ప్రస్తుతం నగరాల్లో సగటు మధ్యతరగతి కుటుంబం ఖర్చులకు ఇది సరిపోయే పరిస్థితి లేదు కదా. కాబట్టి.. మన ప్రస్తుత నెలవారీ ఖర్చుల సరళిని బేరీజు వేసుకుంటే ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. ఇందుకోసం ఈ కింది విధానాన్ని పరిశీలించవచ్చు.  

దశలవారీగా లెక్కింపు..
మీ మొత్తం నెలసరి ఇంటి ఖర్చులన్నీ (ఈఎంఐలు సహా) లెక్కేయండి. అందులో నుంచి ఈఎంఐలను తీసివేస్తే.. మొత్తం నెలవారీగా ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది. ముందుగా దీనికోసం కవరేజీ పొందాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులను 12తో గుణిస్తే.. ఏడాది మొత్తానికి ఇంటి ఖర్చులు ఎంత అన్నది తెలుస్తుంది.ఇక దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేటుతో వార్షిక ఇంటి ఖర్చులను భాగిస్తే మీ ఆదాయాన్ని సంరక్షించుకోవడానికి ఎంత మొత్తం కవరేజీ అవసరమవుతుందన్నది తెలుసుకోవచ్చు.

ఇక ఆ తర్వాత తీసుకున్న రుణాలకు చెల్లించాల్సిన అసలును కూడా దీనికి కలిపితే.. మొత్తం కవరేజీ ఎంత తీసుకోవాలన్నది తెలుస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీకు కొంత జీవిత బీమా కవరేజీ ఉండి ఉంటే .. మీరు లెక్క వేసిన మొత్తం కవరేజీ నుంచి దాన్ని తీసివేస్తే ఇకపై తీసుకోవాల్సింది ఎంత అన్నదానిపై స్పష్టత వస్తుంది. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు మొదలైన ఆర్థిక అవసరాలు కూడా ఉంటాయి. వీటిని కూడా లెక్క వేసి .. కవరేజీ మొత్తానికి కలిపితే నికరంగా ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలన్నది తెలుస్తుంది.  
ఈ విధంగా అవసరమైన కవరేజీని లెక్క వేసుకుని తగిన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వొచ్చు.

- భరత్‌ కల్సి ,చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top