ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు రెడీ

WEF 2020: Piyush Goyal Speaks At World Economic Forum Annual Conference - Sakshi

భారత్‌లో పెట్టుబడులకు ఉత్సాహపూరిత వాతావరణం

వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత ఆర్థిక వ్యవస్థ టేకాఫ్‌కు సిద్ధంగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొన్నట్టు పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో చర్చలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

మంత్రిని కాకపోతే ఎయిరిండియాకు బిడ్డింగ్‌
‘‘నేను ఇప్పుడు మంత్రిని కాకపోయి ఉంటే ఎయిరిండియాకు బిడ్డింగ్‌ వేసే వాడిని. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతో ఎయిరిండియాకు ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయి. దీంతో ఇది బంగారు గని కంటే తక్కువేమీ కాదు’’ అని ఎయిరిండియా, బీపీసీఎల్‌ ప్రైవేటీకరణపై ఎదురైన ప్రశ్నకు మంత్రి గోయల్‌ బదులిచ్చారు.

సదస్సులో ఇతర ముఖ్యాంశాలు...
►సమాచార గోప్యత (డేటా ప్రైవసీ)ను మానవ హక్కుగా చూడాలని, దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. అనుమతి మేరకే పెద్ద ఎత్తున డేటాను వినియోగం సమాజానికి మంచిదన్నారు. 
►స్థిరమైన ఇంధన పరివర్తన దిశగా బ్యాటరీలకు సంబంధించి నూతన నియమాలను నిర్ణయించేందుకు అమరరాజా బ్యాటరీస్‌ సహా అంతర్జాతీయంగా 42 సంస్థలు అంగీకారం తెలిపాయి.  
►బిట్‌కాయిన్‌ వంటి డిజిటల్‌ కరెన్సీలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో ఈ విషయమై సెంట్రల్‌ బ్యాంకులకు సాయపడేందుకు డబ్ల్యూఈఎఫ్, 40 దేశాల కేంద్ర బ్యాంకులతో కూడిన కమ్యూనిటీ ఓ కార్యాచరణను రూపొందించింది.
►పర్యావరణ అనుకూలమైన, నైతిక ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు స్పందించేందుకు వీలుగా అన్ని రంగాల్లోని వ్యాపార సంస్థలకు సాయపడే విధంగా రూపొందించిన బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రపంచ ఆర్థిక వేదికలో ఆవిష్కరించారు. 
►డిజిటల్‌ ట్యాక్స్‌ సమస్యల పరిష్కార ప్రణాళికకు 137 దేశాలు మద్దతిచ్చినట్లు ఓఈసీడీ చీఫ్‌ ఆంగెలాగురియా చెప్పారు.
►ప్రభుత్వ విధానాల పరంగా స్పష్టత, నిలకడ  ఉండాలని, న్యాయ సంస్కరణలు కావాలని  అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కోరుతున్నట్లు టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top