మాల్యా ఆస్తుల అమ్మకం యోచనలో యూఎస్‌ఎల్‌ | Sakshi
Sakshi News home page

మాల్యా ఆస్తుల అమ్మకం యోచనలో యూఎస్‌ఎల్‌

Published Wed, May 31 2017 12:30 AM

మాల్యా ఆస్తుల అమ్మకం యోచనలో యూఎస్‌ఎల్‌

న్యూఢిల్లీ: ఒప్పందం ప్రకారం వ్యాపారవేత్త, మాజీ చైర్మన్‌ విజయ్‌ మాల్యా  గడువులోగా నిర్దిష్ట 13 ప్రాపర్టీలను తిరిగి కొనుగోలు చేయకపోవడంతో వాటిని విక్రయించాలని యునైటెడ్‌ స్పిరిట్స్‌ యోచిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో యూఎస్‌ఎల్‌ను డియాజియో సంస్థ దక్కించుకున్న దరిమిలా కుదిరిన 75 మిలియన్‌ డాలర్ల డీల్‌ కింద నిర్దేశిత గడువులోగా మాల్యా తన ప్రాపర్టీలను తిరిగి కొనుక్కోవాల్సి ఉంది. అయితే, గడువు తీరిపోయినప్పటికీ మాల్యా గానీ ఆయన నామినీ గానీ కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌ రేటు  ప్రకారం వీటిని విక్రయించాలని యోచిస్తున్నట్లు యూఎస్‌ఎల్‌ తెలిపింది.

నష్టాల్లోకి యునైటెడ్‌ స్పిరిట్స్‌
లిక్కర్‌ కింగ్‌ యునైటెడ్‌ స్పిరిట్స్‌ మార్చి క్వార్టర్లో రూ.104 కోట్ల నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.1.4 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. ఆదాయం మాత్రం 9 శాతం వృద్ధితో రూ.5,931 కోట్ల నుంచి రూ.6,474 కోట్లకు వృద్ధి చెందింది. 2016–17లో మాత్రం కంపెనీ లాభం రూ.170 కోట్లు, ఆదాయం రూ.25,354 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.122 కోట్లు, రూ.23,384 కోట్లుగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement