
జియోని వివరణ కోరిన ట్రాయ్...
టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఉచిత వాయిస్, డేటా ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపు విషయమై రిలయన్స్ జియోని వివరణ కోరింది.
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఉచిత వాయిస్, డేటా ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపు విషయమై రిలయన్స్ జియోని వివరణ కోరింది. నిబంధనల ప్రకారం ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజులు వరకు మాత్రమే ఉండాలి. ఈ నేపథ్యంలో ఆఫర్ పొడిగింపు నిర్ణయం నిబంధనలకు ఏవిధంగా విరుద్ధం కాదో తెలియజేయాలని ట్రాయ్ తన లేఖలో పేర్కొంది. కాగా ఈ అంశమై జియో స్పందిచలేదు. కాగా ట్రాయ్ లేఖ ఆధారంగా చూస్తే.. జియోకి డిసెంబర్ 18 నాటికి 6.3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
జియో వెల్‌కమ్ ఆఫర్‌కి, న్యూ ఇయర్ ఆఫర్ ఒకే తరహావి కాదని, రెండింటి మధ్య వ్యత్యాసముందని జియో.. ట్రాయ్‌కి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ట్రాయ్ వచ్చే మార్చి 31కి నెలవారీగా ఎంత మంది యూజర్లు జతవుతారో ముందుగానే తెలియజేయాలని జియోని కోరినట్లు తెలుస్తోంది. కాగా జియో ఆఫర్ పొడిగింపును ట్రాయ్ అంగీకరించడాన్ని సవాల్ చేస్తూ ఎయిర్‌టెల్ ఇటీవలే టెలికం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం తెలిసిందే.