
2025 కల్లా 50 బిలియన్ డాలర్లు
హైదరాబాద్ ఐటీ పరిశ్రమ 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ఐటీ పరిశ్రమ 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీ ఐటీ పరిశ్రమ 120 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. నాస్కామ్ ఏర్పడి 25 ఏళ్లు అయిన సందర్భంగా శుక్రవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు వెయ్యి ఎకరాల్లో 800 పైచిలుకు ఐటీ సంస్థలు విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. వీటి ద్వారా 4.5 లక్షల మంది ప్రత్యక్షంగాను, 10 లక్షల మంది పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారని చెప్పారు. దేశం మొత్తం మీద జరిగే ఐటీ రిక్రూట్‌మెంట్స్‌లో 20 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని మోహన్‌రెడ్డి తెలిపారు. 2010 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ 200 పైచిలుకు స్టార్టప్స్ ఏర్పాటయ్యాయన్నారు.
ప్రధానంగా బిగ్ డేటా, సోషల్ మీడియా తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల్లో దేశీ ఐటీ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని మోహన్ రెడ్డి చెప్పారు. వినూత్న ఆవిష్కరణలు, అత్యున్నత ఆశయాలు, అవకాశాలతో రాబోయే పాతిక సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమ ప్రస్థానం ఉజ్వలంగా ఉంటుందని నాస్కామ్ భావిస్తోందని ఆయన వివరించారు. పలువురు దేశీ ఐటీ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.