టాటాపై వార్‌.. మిస్త్రీకి షాక్‌!

Tata-Mistry fight: NCLT rules in favour of Tata Sons - Sakshi

ఎన్‌సీఎల్‌టీలో మిస్త్రీ పిటిషన్‌ కొట్టివేత

చైర్‌పర్సన్‌ను తప్పించే అధికారం బోర్డుకు ఉంది

కంపెనీల చట్టానికి అనుగుణంగానే తొలగింపు

మిస్త్రీ వాదనలకు అర్హత లేదు: ఎన్‌సీఎల్‌టీ స్పష్టీకరణ  

ముంబై: ‘టాటా సన్స్‌’, దాని అధిపతి రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసిన సైరస్‌ పల్లోంజి మిస్త్రీకి ఎన్‌సీఎల్‌టీ ముందు ఓటమి ఎదురైంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన ఈ కేసులో టాటాల మాటే చెల్లుబాటైంది. టాటా సన్స్‌ (టాటా గ్రూపు) చైర్మన్‌గా 2016 అక్టోబర్‌లో తనను తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సోమవారం కొట్టివేసింది. ముంబైలోని ఎన్‌సీఎల్‌టీ స్పెషల్‌ బెంచ్‌ టాటా గ్రూపు వాదనలకే ఓటేసింది.

‘‘ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ను తొలగించే అధికారం టాటా సన్స్‌ బోర్డు డైరెక్టర్లకు ఉంటుంది. బోర్డులో అత్యధికులు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతోనే ఆయన్ను తొలగించారు. అంతేకానీ, రతన్‌టాటాకో, సూనవాలాకో అసౌకర్యం కలిగించినందుకు కాదు. టాటా సంస్థలకు సంబంధించిన కీలక సమచారాన్ని మిస్త్రీ  ఆదాయపన్ను విభాగానికి పంపించారు. సమాచారాన్ని ప్రెస్‌కు లీక్‌ చేశారు. ఆ తర్వాత కంపెనీ, బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చారు. అందుకే బోర్డు ఆయన్ను డైరెక్టర్‌గా తొలగించింది’’ అని బెంచ్‌ తన తీర్పులో వివరించింది.

మిస్త్రీ వాదనలు తిరస్కరణ  
‘‘రతన్‌టాటా, సూనవాలా జోక్యం చేసుకున్నారని లేదా వారి ప్రవర్తన కంపెనీ ప్రయోజనాల పట్ల పక్షపాతంగా ఉందన్న వాదనల్లో వాస్తవం లేదని గుర్తించాం. ఈ నేపథ్యంలో మిస్త్రీ తొలగింపుపై కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 241 కింద చర్యలకు అవకాశం లేదు’’ అని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ తన తీర్పులో స్పష్టం చేసింది.

టాటా సన్స్‌ బోర్డు, రతన్‌టాటా తప్పుడు విధానాలు, మైనారిటీ షేర్‌హోల్డర్లను అణచివేస్తున్నారంటూ సైరస్‌ మిస్త్రీ తన పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణలను ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. ఎయిర్‌ఏషియా, నానోకు సంబంధించిన వ్యవహారాలు, కార్పొరేట్‌ పరిపాలన ఉల్లంఘనల విషయంలోనూ మిస్త్రీ ఆరోపణలను తోసిపుచ్చింది. మిస్త్రీ ఆరోపణలకు ఏ మాత్రం యోగ్యత లేదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేస్తూ, కంపెనీల చట్టం 2013కు అనుగుణంగానే టాటా సన్స్‌ బోర్డు వ్యవహరించిందని తేల్చి చెప్పింది.

ఇవీ... కేసు పూర్వాపరాలు
2012లో టాటా సన్స్‌కు ఆరో చైర్మన్‌గా వచ్చిన సైరస్‌ మిస్త్రీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పిస్తూ బోర్డు 2016 అక్టోబర్‌ 24న నిర్ణయాన్ని ప్రకటించింది.
 016 డిసెంబర్‌ 20న మిస్త్రీ తన కుటుంబ కంపెనీలైన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్ప్‌ తరఫున టాటా సన్స్, రతన్‌ టాటా, ఇతర బోర్డు సభ్యులకు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్లు వేశారు.  
   చైర్మన్‌గా తన తొలగింపు కంపెనీల చట్ట ప్రకారం లేదని, టాటా సన్స్‌లో పాలన దుర్వినియోగం జరుగుతోందని మిస్త్రీ ప్రధానంగా వాదించారు. రతన్‌ టాటాతోపాటు మరో టాటా ట్రస్ట్రీ అయిన సూనవాలా గ్రూపు వ్యవహారాల్లో తరచుగా జోక్యం చేసుకుంటూ షాడో డైరెక్టర్లుగా వ్యవహరించారని ఆరోపించారు.  
   2017 ఫిబ్రవరి 6న టాటా సన్స్‌ బోర్డు డైరెక్టర్‌గానూ మిస్త్రీ తొలగింపునకు గురయ్యారు.  
 మిస్త్రీ వాదనల్లో వాస్తవం లేదని, ఆయన తొలగింపు చట్ట ప్రకారమే జరిగిందని తాజాగా ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది.
 టాటా సన్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ కుటుంబానికి 18.34 శాతం వాటా ఉంది.  

పోరు బాటే: మిస్త్రీ
ఎన్‌సీఎల్‌టీ తీర్పు నిరాశపరిచిందని, అంతేకానీ ఆశ్చర్యపరచలేదని మిస్త్రీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఉత్తమ పాలన కోసం, టాటా సన్స్‌లో మెజారిటీ పేరిట జరుగుతున్న ఉద్దేశపూర్వక దౌర్జన్య పాలన నుంచి మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల్ని రక్షించడానికి పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొంది. ఈ ప్రయాణంలో ఎంత కష్టమైనా ఇబ్బంది లేదని, టాటా గ్రూపును వినాశకారుల నుంచి రక్షించడమే తమ బాధ్యతని మిస్త్రీ పేర్కొన్నారు.

స్వాగతించిన రతన్‌ టాటా
ఎన్‌సీఎల్‌టీ తీర్పును టాటా గ్రూపు గౌరవ చైర్మన్‌ రతన్‌టాటా స్వాగతించారు. 2016 అక్టోబర్లో టాటా సన్స్‌ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతమేనని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసిందన్నారు. మన న్యాయవ్యవస్థలోని బలాన్ని, సూత్రాలను ఈ తీర్పు ప్రతిఫలించిందని, దేశం పట్ల మనం గర్వపడేలా చేసిందని వ్యాఖ్యానించారు.

టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ స్పందిస్తూ... టాటా సన్స్, దాని పరిధిలోని ఆపరేటింగ్‌ కంపెనీలు పారదర్శకంగా, వాటాదారుల ఉత్తమ ప్రయోజనాల కోణంలో వ్యవహరించాయని ఎన్‌సీఎల్‌టీ తీర్పు ధ్రువీకరించిందన్నారు.  

బోర్డు రూమ్‌ యుద్ధాలు..
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, సైరస్‌ మిస్త్రీల మధ్య వివాదంతో కంపెనీలపై ఆధిపత్యం కోసం బోర్డు రూమ్‌ వేదికగా జరిగే వ్యూహాలు, యుద్ధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. టాటా గ్రూప్‌ అధినేత రతన్‌ టాటా కూడా స్వయంగా ఇలాంటివి ఎదుర్కొన్నారు.

1990లలో గ్రూప్‌ పగ్గాలు చేతికొచ్చినప్పుడు అప్పటికే స్థిరపడిపోయిన దిగ్గజాలు రూసీ మోదీ, దర్బారీ సేఠ్, అజిత్‌ కేర్కర్, ఏహెచ్‌ టొబాకోవాలా వంటి హేమా హేమీలను రతన్‌ టాటా ఎదుర్కొని నిలవాల్సి వచ్చింది.  రిలయన్స్‌ నుంచి ఇన్ఫోసిస్‌ దాకా పలు దిగ్గజ సంస్థల్లోనూ ఇలాంటి బోర్డు రూమ్‌ యుద్ధాలు చోటుచేసుకున్నాయి.  

అంబానీ వర్సెస్‌ అంబానీ..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం 2002లో ఆయన ఇద్దరు కుమారులు ముకేశ్, అనిల్‌ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూప్‌ యాజమాన్య అం శంపై విభేదాలు ఉన్న మాట వాస్తవమేనంటూ పెద్ద కుమారుడు ముకేశ్‌ 2004 నవంబర్‌లో ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించడం వీటికి ఊతమిచ్చింది. ఆ తర్వాత మీడియా మాధ్యమంగా ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. చివరికి 2005 జూన్‌లో గ్రూప్‌ అసెట్స్‌ విభజన ద్వారా సోదరులిద్దరూ సెటిల్మెంట్‌ చేసుకున్నారు.

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు వర్సెస్‌ బోర్డు
దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించిందంటూ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, నీలేకని, క్రిస్‌ గోపాలకృష్ణన్‌లు ఆందోళన వ్యక్తం చేయడంతో బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య వార్‌ మొదలైంది. మాజీ ఉద్యోగులు రాజీవ్‌ బన్సల్, డేవిడ్‌ కెనెడీలకు భారీ వీడ్కోలు ప్యాకేజీనివ్వడం, అప్పటి సీఈవో విశాల్‌ సిక్కాకు భారీగా జీతభత్యాలు పెంచడం, పనయా సంస్థ కొనుగోలుపై వ్యవస్థాపకులు ప్రశ్నలు లేవనెత్తారు. చివరికి సిక్కా గతేడాది ఆగస్టులో రాజీనామా చేశారు.

యస్‌ బ్యాంక్‌:  కపూర్‌ వర్సెస్‌ కపూర్‌
2008 ముంబై టెర్రరిస్టు దాడుల్లో బ్యాంకు సహ వ్యవస్థాపకుడు అశోక్‌ కపూర్‌ మరణించారు. ఆ తర్వాత కంపెనీ బోర్డులో డైరెక్టర్‌ నియామకం విషయంలో అశోక్‌ కపూర్‌ కుటుంబం, మరో సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది.

అశోక్‌ సతీమణి మధు కపూర్‌.. తమ కుమార్తె షగున్‌ కపూర్‌ గోగియాను డైరెక్టర్‌గా నియమించాలనుకున్నారు. కానీ యస్‌ బ్యాంక్‌ బోర్డు దీన్ని తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2015 జూన్‌లో మధు కపూర్‌ కుటుంబానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top