సహారా ఆస్తులపై కార్పొరేట్‌ దిగ్గజాల కన్ను! | Tata, Godrej, Adani interested in Sahara assets | Sakshi
Sakshi News home page

సహారా ఆస్తులపై కార్పొరేట్‌ దిగ్గజాల కన్ను!

Apr 20 2017 1:10 AM | Updated on Sep 5 2017 9:11 AM

సహారా ఆస్తులపై కార్పొరేట్‌ దిగ్గజాల కన్ను!

సహారా ఆస్తులపై కార్పొరేట్‌ దిగ్గజాల కన్ను!

వివాదంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌ ఆస్తులను వేలంలో దక్కించుకునేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.

బరిలో టాటా, గోద్రెజ్, అదానీ గ్రూప్‌లు
లక్నో సహారా హాస్పిటల్‌పై అపోలో హాస్పిటల్స్‌ దృష్టి
 

న్యూఢిల్లీ: వివాదంలో చిక్కుకున్న సహారా గ్రూప్‌ ఆస్తులను వేలంలో దక్కించుకునేందుకు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దాదాపు రూ. 7,400 కోట్ల విలువ చేసే సుమారు 30 ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు టాటాలు మొదలుకుని గోద్రెజ్, అదానీ, పతంజలి తదితర గ్రూప్‌లు పోటీపడబోతున్నాయి. ప్రాపర్టీల్లో ఎక్కువగా స్థలాలే ఉండటంతో ఒమాక్సే, ఎల్డెకో వంటి రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో పాటు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు, ఇండియన్‌ ఆయిల్‌ వంటి ప్రభుత్వ రంగ దిగ్గజాలు కూడా ఆసక్తి వ్యక్తపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

 ఇదే క్రమంలో లక్నోలోని సహారా హాస్పిటల్‌పై అపోలో హాస్పిటల్స్‌ దృష్టి పెట్టింది. ఇప్పటికే తాము ఆసక్తి వ్యక్తీకరణ పత్రం(ఈవోఐ) సమర్పించినట్లు, మదింపు ప్రక్రియ చేపట్టినట్లు అపోలో హాస్పిటల్స్‌ ప్రతినిధి తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఈ వేలం నిర్వహించనుంది. వేలం ప్రకటనకు భారీ స్పందన లభించిందని, సుమారు 250 పైచిలుకు ఈవోఐలు వచ్చాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ప్రాపర్టీల విక్రయం ద్వారా తొలి విడత నిధులు జూన్‌ 17 నాటికి, మొత్తం సుమారు రూ.7,400 కోట్లు చేతికి రాగలవని సహారా  భావిస్తోంది. జూలై–ఆగస్టు నాటికి సహారా గ్రూప్‌ రూ.10,500 కోట్లు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

వేల్యుయేషన్స్‌పై ప్రభావం..
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సహారా అత్యవసరంగా నిధులు సమకూర్చుకుని, సెబీకి డిపాజిట్‌ చేసే క్రమంలో డీల్స్‌ పూర్తికావడానికి చాలా స్వల్ప సమయమే ఉండటంతో... విక్రయ ప్రక్రియ, వేల్యుయేషన్‌పై ప్రభావం పడవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఆస్తుల వేల్యుయేషన్‌పై అంచనాకు వచ్చేందుకు కొనుగోలుదారులంతా 2–3 నెలల సమయం కోరుతున్నారని, అధిక విలువ గల రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో ఇది సాధారణమేనని పేర్కొన్నాయి.

మరోవైపు, డీల్‌ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో ఫలితం రాగలదని పేర్కొన్న సహారా గ్రూప్‌ ప్రతినిధి... కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న వారి పేర్లు వెల్లడించడానికి నిరాకరించారు. పుణేలోని భారీ స్థలం కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రెజ్‌ తెలిపారు. అటు ఒమాక్సే సీఎండీ రోహ్‌తాస్‌ గోయ ల్, ఎల్‌డెకో ఎండీ పంకజ్‌ బజాజ్‌ కూడా కొన్ని ప్రాపర్టీలపై ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. సహారా గ్రూప్‌ సంస్థలు అక్రమంగా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను వాపసు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గ్రూప్‌ ఆస్తుల వేలం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement