సన్ ఫార్మాకు ర్యాన్‌బాక్సీ ఎఫెక్ట్

సన్ ఫార్మాకు ర్యాన్‌బాక్సీ ఎఫెక్ట్


క్యూ4లో రూ.888 కోట్ల నికర లాభం

న్యూఢిల్లీ: ఔషధ రంగ దిగ్గజ కంపెనీ, సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.888 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1,587 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ విలీనం, అమెరికా మార్కెట్లలో కొన్ని ఔషధాల ధరలు తగ్గించడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ వివరించింది. నికర అమ్మకాలు 2013-14 క్యూ4లో రూ.4,044 కోట్లుగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో  రూ.6,145 కోట్లుగా ఉన్నాయని తెలిపింది.

 

ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,141 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,541 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.16,004 కోట్ల నుంచి రూ.27,287 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ కంపెనీని కొనుగోలు చేసినందున ఆర్థిక ఫలితాల(పూర్తి సంవత్సరం, క్యూ4 కూడా)ను పోల్చడానికి లేదని కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం అమ్మకాల్లో అమెరికా మార్కెట్ వాటా 50 శాతంగా ఉందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వృద్ధితో రూ.966 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top