రాష్ట్రాలకు దండిగా ‘పెట్రో’ ఆదాయం

States to get Rs 22700 crore windfall from rupee plunge, oil spike: SBI - Sakshi

ధర  పెరుగుదల వల్ల వ్యాట్‌ రూపంలో  లాభాలు...

సగటున ఈ మొత్తం రూ.22,700 కోట్లు

ధరలు తగ్గించేందుకు వెసులుబాటు

ఎస్‌బీఐ రిసెర్చ్‌ నివేదిక  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలూ తీవ్రంగా ఉన్నాయి. దీనితో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆయా అంశాలు రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారీ మొత్తంలో రూ.22,700 కోట్ల ‘వ్యాట్‌’ (వీఏటీ) ఆదాయాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్‌ ధర సగటున 75 డాలర్లు, డాలర్‌ మారకంలో రూపాయి 72గా ఉంటుందని భావిస్తూ తాజా అంచనాలు లెక్కగట్టడం జరిగింది. ఈ అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌కు ఒక డాలర్‌ ధర పెరిగితే, రూపాయిల్లో ఇది 19 రాష్ట్రాలకు సగటును రూ.1,513 కోట్ల పన్ను ఆదాయాన్ని తెచ్చిపెట్టే వీలుంది. వేర్వేరుగా చూస్తే, ఈ ఆదాయాల విషయంలో రూ.3,389 కోట్లతో మహారాష్ట్ర ముందు నిలవగా, రూ.2,842 కోట్లతో గుజరాత్‌ రెండవ స్థానంలో నిలవనుంది.
 మహారాష్ట్రలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.89 దాటింది. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌పై వ్యాట్‌ అత్యధికంగా 39.12% ఉంది. ఈ విషయంలో గోవాలో కేవలం 16.66 శాతం వ్యాట్‌ అమలవుతోంది.
   ఇతర పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని భావిస్తే, పెట్రో ధరల పెంపుతో వస్తున్న ఆదాయాల వల్ల రాష్ట్రాలు తమ ద్రవ్యలోటును సగటున 15 నుంచి 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించుకోవచ్చు.
   2018–19 బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికి మించిన ఆదాయం వస్తున్న నేపథ్యంలో తమ ఆదాయాలకు ఢోకా లేకుండా రాష్ట్రాలు.. డీజిల్‌పై లీటరుకు సగటున రూ. 2.30 పైసలు, పెట్రోల్‌పై రూ.3.20 పైసలు ధర తగ్గించుకునే వీలుంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటకలకు ఆర్థికంగా పెట్రోల్‌ లీటర్‌కు రూ.3, డీజిల్‌పై రూ.2.50 తగ్గించే వెసులుబాటు ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top