పావు శాతం రేట్ల కోత చాన్స్! | State Bank of India mulls 25 basis point interest rate cut | Sakshi
Sakshi News home page

పావు శాతం రేట్ల కోత చాన్స్!

Sep 12 2016 1:06 AM | Updated on Sep 4 2017 1:06 PM

పావు శాతం రేట్ల కోత చాన్స్!

పావు శాతం రేట్ల కోత చాన్స్!

బ్యాంకులు త్వరలో పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం దిగొస్తుంది...
* రిటైల్ రుణాలవైపు బ్యాంకుల మొగ్గు...
* ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
ముంబై: బ్యాంకులు త్వరలో పావు శాతం మేర వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగిరానున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోపక్క, దేశీ బ్యాంకింగ్ రంగం మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్య నుంచి కోలుకోవడం అనేది ఆర్థిక వ్యవస్థ పనితీరుతో ముడిపడి ఉంటుందన్నారు. వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వార్తా ఏజెన్సీలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించారు.

‘ఇటీవల రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. అయితే, ఈ ప్రభావం మెల్లగా తొలగనుండటంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేందుకు వీలుంది. వెరసి బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గుదలకు దోహదం చేయనుంది’ అని భట్టాచార్య తెలిపారు. ఆర్‌బీఐ గత ఏడాదికాలంగా కీలక పాలసీ రేటు(రెపో)ను 1.5 శాతం మేర తగ్గించినప్పటికీ.. రుణ రేటు తగ్గింపునకు సంబంధించి ఈ మొత్తం ప్రయోజనంలో దాదాపు సగాన్ని మాత్రమే బ్యాంకులు తమ కస్టమర్లకు బదలాయించిన సంగతి తెలిసిందే.
 
ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమే...
ప్రభుత్వం నిర్దేశించిన 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం కష్టసాధ్యమైనదేనని ఎస్‌బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో గడిచిన 60 ఏళ్లలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం చాలా అరుదుగా మాత్రమే 6 శాతం దిగువకు వచ్చిందని, మరోపక్క, మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లపాటు వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతం(2 శాతం అటూఇటుగా)గా ప్రభుత్వం నిర్దేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ లక్ష్యం 5 శాతంగా ఉంది.
 
మొండిబకాయిలపై..: ఇప్పటివరకూ పోగుపడిన మొండిబకాయిలను(ఎన్‌పీఏ) తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. అయితే, కొత్తగా ఎన్‌పీఏలు జతవుతూనే ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. ‘రానున్న కాలంలో దాదాపు రూ.40 వేల కోట్ల ఎన్‌పీఏలకు ఆస్కారం ఉందని మేం ఇప్పటికే అంచనా వేశాం. ఇందులో 8,000-9,000 కోట్ల విలువైన రుణాలు ఇప్పటికే ఈ జాబితాలో చేరాయి. ఈ సమస్యనుంచి పూర్తిగా గట్టెక్కాలంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకోవాల్సి ఉంటుంది. ఇందుకు దీర్ఘకాలమే పట్టొచ్చు. అయితే, ఐదేళ్లలోపే ఎకానమీ మళ్లీ పరుగులు తీస్తుందని భావిస్తున్నా’ అని ఎస్‌బీఐ చీఫ్ అభిప్రాయపడ్డారు.
 
కార్పొరేట్ రుణాలు భారం..
కార్పొరేట్ రుణాలకు సంబంధించి ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా మొగ్గుచూపే అవకాశం ఉందని భట్టాచార్య పేర్కొన్నారు. రిటైల్ రుణ విభాగంలో ఎలాంటి సమస్యలూ(బబుల్) లేవని స్పష్టంచేశారు. పెద్దస్థాయి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రుణం నిర్ధిష్ట పరిమితిదాటితే బ్యాంకులు తప్పకుండా అదనపు కేటాయింపులు(ప్రొవిజనింగ్) చేయాలని ఆర్‌బీఐ గత నెలలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్‌పీఏలు 14.5 శాతానికి ఎగబాకి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిబంధనలకు తెరతీసింది.

‘ఈ నిబంధనల కారణంగా రుణగ్రహీతలతో పాటు బ్యాంకులకు కూడా భారం పెరుగుతుంది. ఆర్‌బీఐ చర్యలతో బ్యాంకులు రిటైల్ రుణాలవైపు అధికంగా దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక మా రిటైల్ రుణ విభాగం గతేడాది 20 శాతం మేర వృద్ధి చెందింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఇదేస్థాయి వృద్ధి నమోదైంది. మొండిబకాయిల పెరుగుదల సంకేతాలేవీ లేవు. మరోపక్క, దేశ జీడీపీతో పోలిస్తే బ్యాంకుల మొత్తం రిటైల్ రుణాలు 10 శాతం కంటే తక్కువే. ఇతర వర్ధమాన దేశాలతోపోలిస్తే ఇదే అత్యంత కనిష్టం. ఈ నేపథ్యంలో రానున్నకాలంలో ఈ విభాగంలో భారీ రుణ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి’ అని ఎస్‌బీఐ చీఫ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement