
సాక్షి, ముంబై : హోలీ పర‍్వదినం సందర్భంగా ఈ రోజు (21, మార్చి) మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో ఇన్వెస‍్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన కీలక సూచీలు చివరికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు ఎగిసి 38,386 వద్ద, నిప్టీ 11 పాయింట్లు నీరసించినా 11,521కి పైన ముగియడం విశేషం.
మరోవైపు కీలక వడ్డీరేట్లపై ఫెడ్ యథాతథంగా నిర్ణయం ఆసియా మార్కెట్లకు జోషినిస్తోంది. వాషింగ్‌టన్‌లో రెండు రోజులపాటు జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్, ద్రవ్యోల్బణం ఒత్తిడులతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు 2.25-2.5 శాతం శ్రేణిలో ఉన్నాయి.