ఇండియన్ స్టాక్స్ దీపావళి.. | Sensex likely to touch 29000 by this Diwali & 100000 by 2020 | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్టాక్స్ దీపావళి..

Oct 19 2014 12:59 AM | Updated on Aug 21 2018 9:38 PM

స్టాక్ మార్కెట్లు - Sakshi

స్టాక్ మార్కెట్లు

ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు దీపావళి వెలుగులు నింపాయి. అన్ని వైపుల నుంచి సానుకూల సంకేతాలు కనిపిస్తుండటంతో మరికొంత కాలం కూడా ఇదే విధమైన వెలుగులు కొనసాగుతాయన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ.

మరికొంత కాలం ఏటా 20-25 శాతం రాబడి
2020 సెన్సెక్స్ టార్గెట్ 1,00,000లో మార్పు లేదు

 
ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు దీపావళి వెలుగులు నింపాయి. అన్ని వైపుల నుంచి సానుకూల సంకేతాలు కనిపిస్తుండటంతో మరికొంత కాలం కూడా ఇదే విధమైన వెలుగులు కొనసాగుతాయన్నది మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఇప్పటికే బాగా పెరిగిన స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆకర్షిస్తున్న అంశాలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ అంచనాలే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ..


దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందన్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అంచనాలను మించి తొలి త్రైమాసికంలో 5.7% వృద్ధిరేటు నమోదు కావడమే దీనికి నిదర్శనం. గత ఎనిమిది త్రైమాసికాలుగా 5% లోపు వృద్ధి నమోదు చేస్తున్న జీడీపీ ఒక్కసారిగా పైకి ఎగబాకింది. అధికారంలోకి స్థిరమైన ప్రభుత్వం రావడంతో రానున్న కాలంలో పెట్టుబడుల జోరు పెరుగుతుందని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతున్నారు. గత కొన్ని నెలలుగా విడుదలవుతున్న మాక్రో ఎకనామిక్ డేటా కూడా స్థిరమైన వృద్ధిరేటుపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ఐఐపీ, పీఎంఐ ఇండెక్స్‌ల్లో వృద్ధి, ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, ద్రవ్యలోటు తగ్గుదల ఇలా ఎటు చూసినా అన్నీ సానుకూల అంశాలే. ఈ ఏడాది జీడీపీలో 6% వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం.

కలిసొచ్చిన చమురు ధరలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం దేశ ఆర్థిక వ్యవస్థకు కలిసొచ్చింది. ఏటా 140 బిలియన్ డాలర్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని నెలల క్రితం 115 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు 85 డాలర్లకు పడిపోయింది. డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేయడం కలిసొచ్చే అంశం.
 
మేకిన్ ఇండియా
మోదీ ప్రభుత్వం తయారీ రంగంపై ప్రధానంగా దృష్టిసారించడం ఒక సానుకూలాంశం. మేకిన్ ఇండియా నినాదంతో అంతర్జాతీయ కంపెనీలు ఇండియాలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ , వ్యవసాయ ఉత్పత్తులు, లెదర్, టెక్స్‌టైల్, జెమ్స్ అండ్ జ్యూయలరీ రంగాలు లబ్ధిపొందనున్నాయి. జపాన్, అమెరికా పర్యటనల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధాని సఫలమయ్యారు. జీఎస్‌టీని సమర్థవంతంగా అమలు చేస్తే జీడీపీలో ఒకటి నుంచి రెండు శాతం అదనపు వృద్ధి కనపడుతుంది. ఆగిపోయిన ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో కదలిక తీసుకురావడం, బీమాలో ఎఫ్‌డీఐని 49 శాతానికి పెంచడం,వంటి కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వం  అడుగులు వేస్తోంది.

అంతర్జాతీయ పరిణామాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. అమెరికా రికవరీ బాట పట్టడం, యూరో జోన్ స్థిరంగా ఉండటం దేశీయ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలు. 2015 మధ్య వరకు అమెరికా వడ్డీరేట్లను పెంచే అవకాశం లేదని గట్టిగా విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయంగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండటంతో ఈ విషయంలో భారత్ బాగా లబ్ధిపొందనుంది.  ఈ ఏడాది ఇప్పటికే భారతీయ మార్కెట్లు ఇతర దేశాల కంటే అధిక రాబడిని అందించాయి. దీంతో గత జనవరి నుంచి ఎఫ్‌ఐఐలు 12.5 బిలియన్ డాలర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. రానున్న కాలంలో కూడా ఎఫ్‌ఐఐ పెట్టుబడులు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 8 రంగాలే కీలకం
 బొగ్గు
 క్రూడ్ ఆయిల్
 నేచురల్ గ్యాస్
 పెట్రోలియం రిఫైనరీ ప్రోడక్ట్స్
 స్టీల్
 ఫెర్టిలైజర్స్
 సిమెంట్
 ఎలక్ట్రిసిటీ

 
లాభాలే లాభాలు..
గత త్రైమాసికం నుంచి కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి కనిపిస్తోంది. రూపాయి విలువ క్షీణించడంతో సెన్సెక్స్ కంపెనీల ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. 2013లో 5 శాతంగా ఉన్న సెన్సెక్స్ కంపెనీల ఆదాయ వృద్ధి, గతేడాది 10 శాతానికి చేరింది. ముఖ్యంగా ఐటీ, హెల్త్‌కేర్, ప్రైవేటు బ్యాంకు ఆదాయాల వృద్ధి బాగుంది. సిమెంట్, ఆటోమొబైల్ కంపెనీలు రికవరీ బాట పట్టాయి.  ఈ ఆర్థిక సంవత్సరం సెన్సెక్స్ ఈపీఎస్ వృద్ధి 15 శాతంగా ఉండొచ్చని అంచనా.

వచ్చే కొద్ది సంవత్సరాలు సెన్సెక్స్ సగటు ఈపీఎస్ వృద్ధి 20 నుంచి 25 శాతం వరకు పెరగొచ్చు. 2020 నాటికి సెన్సెక్స్ 1,00,000 మార్కును చేరుకుంటుందని అంచనాలో ఎటువంటి మార్పులేదు. విలువపరంగా ప్రభుత్వం బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న త్రైమాసికాల్లో ఈ రంగ షేర్ల విలువలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరగా  మార్కెట్లో వచ్చే ప్రతీ పతనాన్ని కొనుగోళ్లకు వినియోగించుకోమని సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement