సగం తగ్గిన లాభాలు | Sakshi
Sakshi News home page

సగం తగ్గిన లాభాలు

Published Fri, Dec 14 2018 4:26 AM

Sensex ends over 150 points higher to close at 35,930, Nifty up 54 points - Sakshi

స్టాక్‌ మార్కెట్లో వరుసగా మూడో రోజూ లాభాలు కొనసాగాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడయ్యాయి. బ్యాంక్‌ల అధినేతలతో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ భేటీ కానుండటం కూడా కలసివచ్చింది. రూపాయి బలపడగా, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటంతో స్టాక్‌సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 151 పాయింట్లు లాభపడి 35,930 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 10,792 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే మూడు రోజుల వరుస లాభాల కారణంగా మధ్యాహ్నం తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో స్టాక్‌ సూచీల లాభాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి.  

గణాంకాలతో కళకళ....
ఆసియా మార్కెట్ల జోష్‌తో మన మార్కెట్‌ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి 8.1 శాతానికి పుంజుకోవడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.  రిటైల్‌ ద్రవ్యల్బోణం తగ్గడంతో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు పెరిగాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధినేతలతో ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువార భేటీ కానుండటంతో బ్యాంకింగ్‌ రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో బ్యాంక్‌ షేర్లు కళకళలాడాయి. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 317 పాయింట్లు, నిఫ్టీ 101 పాయింట్ల వరకూ పెరిగాయి. అయితే వరుస మూడు రోజుల ర్యాలీ కారణంగా మధ్యాహ్నం తర్వాత కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ లాభాలు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,800 పాయింట్లపైకి ఎగబాకినప్పటికీ, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి.  

ఆల్‌టైమ్‌ హైకి హెచ్‌యూఎల్‌..
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల రానున్నందున గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారిస్తుందని, గ్రామీణ మార్కెట్లో డిమాండ్‌ను పెంచే పథకాలు, నిర్ణయాలు రానున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో వినియోగ కంపెనీల షేర్లు మంచి లాభాలు సాధించాయి. హిందుస్తాన్‌ యూనిలివర్, కాల్గేట్‌ పామోలివ్‌ (ఇండియా) షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.  
► సన్‌ఫార్మాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని సెబీ వెల్లడించడంతో సన్‌ ఫార్మా షేర్‌ 2 శాతం నష్టంతో రూ.422 వద్ద ముగిసింది.  
► టార్గెట్‌ ధరను రూ.350 నుంచి రూ.375కు మోర్గాన్‌ స్టాన్లీ పెంచడంతో ఎస్‌బీఐ షేర్‌ 1 శాతం లాభంతో రూ. 288 వద్దకు చేరింది.  
► ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో క్యాపిటల్‌ ఫస్ట్‌ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆమోదం తెలపడంతో ఈ రెండు షేర్లు ఇంట్రాడేలో చెరో 7 శాతం వరకూ ఎగిశాయి.   


రూపాయి వరుస నష్టాలకు బ్రేక్‌
ముంబై: వరుసగా మూడు రోజుల పాటు నష్టపోయిన రూపాయి.. గురువారం కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే 33 పైసలు బలపడి 71.68 వద్ద క్లోజయ్యింది. డాలర్‌ బలహీనపడటం, ముడిచమురు ధరలు కాస్త తగ్గుముఖం పడుతుండటం ఇందుకు కారణం. కీలక అంశాల్లో సంబంధిత వర్గాలందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటానంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా కొత్తగా నియమితులైన శక్తికాంత దాస్‌ భరోసానివ్వడం కూడా రూపాయికి కొంత ఊతమిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement