ఎస్‌బీఐ నష్టాలు రూ.7,718 కోట్లు

SBI reports second straight quarterly loss at Rs 7718 crore - Sakshi

గత క్యూ4లో రికార్డ్‌ నష్టాలు

వంద శాతానికి పైగా పెరిగిన మొండి బకాయిల కేటాయింపులు  

ఇది ఆశావహ సంవత్సరం  

2020 ఎస్‌బీఐకు సంతోష సంవత్సరం  

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా భారత దేశ అతి పెద్ద బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయి నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.7,718 కోట్ల నికర నష్టాలు (స్డాండెలోన్‌) వచ్చాయని ఎస్‌బీఐ తెలిపింది.

అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.2,815 కోట్ల నికర లాభం వచ్చిందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వివరించారు. సీక్వెన్షియల్‌గా చూసినా నికర నష్టాలు పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,416 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వివరించారు.

ఇటీవలే పీఎన్‌బీ  రూ.13,417 కోట్ల నికర నష్టాలు ప్రకటించింది. ఆ బ్యాంక్‌ తర్వాత దేశంలో అత్యధికంగా నష్టాలు ఎస్‌బీఐకే వచ్చాయి.  గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నిర్వహణ లాభం, నికర వడ్డీ ఆదాయం తగ్గగా, వడ్డీయేతర ఆదాయం మాత్రం మెరుగుపడింది. ఆర్‌బీఐ గత ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన కొత్త మార్గదర్శకాల కారణంగా ఒత్తిడి రంగాలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు అధిక రేట్ల ప్రకారం కేటాయించాల్సి వచ్చిందని పేర్కొంది.  

ఇప్పుడు ఎస్‌బీఐ మరింత పటిష్టం
మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా ఉండడం, పెట్టుబడి ఆదాయం తక్కువగా ఉండటం లాభాలపై ప్రభావం చూపాయని రజనీష్‌ కుమార్‌ చెప్పారు. వీటితో పాటు ట్రేడింగ్‌ నష్టాలు పెరగడం, వేతన సవరణ కోసం కూడా అధిక కేటాయింపులు జరపడం, బాండ్ల రాబడులు పెరగడం వల్ల మార్క్‌–టు–మార్కెట్‌ నష్టాలు పెరగడం  వల్ల కూడా గత  క్యూ4లో భారీగానష్టాలు వచ్చాయని వివరించారు. 

ఈ మార్క్‌–టు–మార్కెట్‌ నష్టాలను తర్వాతి నాలుగు క్వార్టర్లలో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, మొత్తం నష్టాలను గత క్యూ4లోనే చూపించామని చెప్పారు. గత మూడేళ్లు ఎస్‌బీఐకి సమస్యాత్మకంగానే ఉందని, రెండేళ్ల కంటే ఇప్పుడు ఎస్‌బీఐ మరింత పటిష్టంగా ఉందని  వ్యాఖ్యానించారు.

పుష్కలంగా మూలధన నిధులు
మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు.  కామన్‌ ఈక్విటీ టైర్‌ వన్‌ మూలధనం ఈ ఏడాది మార్చి నాటికి 0.27% వృద్ధితో 9.68 శాతానికి పెరిగిందని వివరించింది. ఇది ఆశావహ సంవత్సరం అన్నారు. 2020 బ్యాంక్‌కు సంతోష సంవత్సరం అవుతుందని విశ్లేషించారు.

భారీ నష్టాలున్నా...లాభపడిన షేర్‌   
భారీ నష్టాలు ప్రకటించినప్పటికీ, ఎస్‌బీఐ షేర్‌ జోరుగా పెరిగింది. స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ,  ఫలితాల అనంతరం ఎస్‌బీఐ షేర్‌ దూసుకుపోయింది. బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేర్‌ 3.7 శాతం లాభంతో రూ. 254 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 6 శాతం లాభంతో రూ.260ను తాకింది.

షేర్‌ ధర జోరుగా పెరగడంతో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8,078 కోట్లు పెరిగి రూ. 2,26,818 కోట్లకు పెరిగింది.  ఎస్‌బీఐకి అధ్వాన పరిస్థితులు ముగిసినట్లేనని ఇన్వెస్టర్లు భావించారని, దీంతో షేర్‌ ధర పెరిగిందని ఐడీబీఐ క్యాపిటల్‌ వ్యాఖ్యానించింది. ఇతర బ్యాంక్‌ల ఫలితాల సరళిని బట్టి చూస్తే, ఎస్‌బీఐ ఇంకా అధిక నష్టాలు ప్రకటించగలదన్న అంచనాలున్నాయని, కానీ ఆ అంచనాల కంటే రూ.2,000 కోట్ల తక్కువే నష్టాలను ప్రకటించిందని వివరించింది.

భూషణ్‌ స్టీల్‌ డీల్‌ వల్ల లాభమే!
తమ అనుబంధ సంస్థల్లో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ కార్డ్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ల్లో వాటాలను విక్రయించనున్నామని కుమార్‌ తెలిపారు. కాగా భూషణ్‌ స్టీల్‌ను టాటా స్టీల్‌ కొనుగోలు వల్ల ఎస్‌బీఐకి  ప్రయోజనం కలుగనున్నదని విశ్లేషణ. ఎస్‌బీఐ నికర లాభం రూ.1,300 కోట్ల మేర పెరుగుతాయని. ఎన్‌పీఏలు రూ.11,000 కోట్ల మేర తగ్గుతాయని అంచనా.

బ్యాంక్‌ ఫలితాలు ముఖ్యాంశాలు...
2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.10,993 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 119 శాతం పెరిగి రూ.24,080 కోట్లకు ఎగిశాయి.  
   మొత్తం కేటాయింపులు రూ.11,740 కోట్ల నుంచి రూ.28,096 కోట్లకు పెరిగాయి.  
    ఆదాయం రూ.57,720 కోట్ల నుంచి రూ.68,436 కోట్లకు పెరిగింది.
   నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.19,974 కోట్లకు పెరిగింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 0.26 శాతం తగ్గి 2.67 శాతానికి చేరింది.  
    ఫీజు ఆదాయం 13 శాతం పెరగడంతో ఇతర ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.12,222 కోట్లకు పెరిగింది.  
 ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 5 శాతం పెరిగి 66.17 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్‌ రంగంలో ఉత్తమ ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో ఉన్న బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి.
    రద్దు చేసిన రుణాలకు సంబంధించిన రికవరీలు 21 శాతం వృద్ధి చెందాయి.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో..
   2016–17లో రూ.10,484 కోట్ల నికర లాభం రాగా,  గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,547 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.
ఇదే కాలంలో  ఆదాయం మొత్తం రూ.2,10,979 కోట్ల నుంచి రూ.2,59,664 కోట్లకు పెరిగింది.  
    గత ఏడాది మార్చినాటికి రూ.1,12,343 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,23,427 కోట్లకు పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు రూ.59,277 కోట్ల నుంచి రూ.1,10,855 కోట్లకు పెరిగాయి.  
   శాతం పరంగా చూస్తే, గత ఏడాది మార్చినాటికి 6.90 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 10.91 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, అర శాతమే పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.71 శాతం నుంచి 5.73 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.12 శాతమే పెరుగుదల ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top