
పెట్టుబడి కూడా దక్కని ఉల్లిరైతు
క్వింటా ఉత్పత్తికి రూ.1,750
మద్దతు ధర నామమాత్రంగా రూ.1,200
పంట అంతంతమాత్రంగా మార్కెట్‌లోకి వస్తేనే ఈ దుస్థితి
పూర్తి స్థాయిలో వస్తే పరిస్థితి ఏమిటని ఆందోళన
మద్దతు ధర రూ.2,000 పెంపునకు డిమాండ్
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ హయాంలో మిరప, పత్తి, మామిడి, టమాట తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే యూరియా కొరత సతమతం చేస్తున్న సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఉల్లి పండించే జిల్లాల్లో కర్నూలుదే అగ్రస్థానం. మహారాష్ట్రలోని పునే తర్వాత అత్యధికంగా ఉల్లి సాగవుతున్నది ఇక్కడే. అయితే ఇప్పుడున్న ధరలతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 19,288 హెక్టార్లుకాగా (హెక్టార్ దాదాపు 2.5 ఎకరాలు) 15,704 హెక్టార్లలోనే సాగయింది. ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం హెక్టారుకు 150 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. దీని ప్రకారం చూస్తే, జిల్లా మొత్తంగా ఉల్లి ఉత్పాదకత అంచనా 23,55,600 క్వింటాళ్లు. అయితే ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చిన దిగుబడి 2,52,000 క్వింటాళ్లు. అంతంత మాత్రం మార్కెట్‌లోకి వచ్చిన ఉల్లిగడ్డలనే కొనేవారు లేరు. పూర్తి స్థాయి పంట మార్కెట్‌లోకి వస్తే పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు.
క్వింటాకు తక్షణ నష్టం రూ.550
అప్పులు, పంట చేతికి వచ్చి అమ్ముకోవడానికి పట్టే నాలుగు నెలల కాలంలో వడ్డీల భారం వెరసి ఉల్లి రైతుకు పెను భారమవుతోంది. మొత్తంగా క్వింటా ఉల్లిగడ్డలు పండించి మార్కెట్‌కు తీసుకురావడానికి రూ.1,750 వరకు (కేజీకి రూ.17.50 చొప్పున) ఖర్చవుతోంది. కూటమి ప్రభుత్వం ఉల్లికి ఇస్తున్న మద్దతు ధర రూ.1,200 మాత్రమే. అంటే పెట్టుబడిలోనే క్వింటాపై రైతులు రూ.550 నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ధరను కనీసం రూ.2,000కు పెంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇతర ప్రాంతాలకు వలస
ధర లేక నష్టాలు మూట కట్టుకుంటున్న రైతులు గిట్టుబాటు ధర కోసం వలస బాట పడుతున్నారు. ప్రభుత్వం రూ.1,200 మద్దతు ధర ప్రకటించినప్పటికీ పెట్టుబడి కూడా దక్కకపోవడంతో అనేక మంది రైతులు చిత్తూరు, తిరుపతి, గంటూరు తదితర ప్రాంతాలకు ఉల్లిగడ్డలు తీసుకెళ్లి ప్రధాన రహదారులు, నగరాల్లోని ప్రధాన కూడళ్లలో అమ్మకాలు సాగిస్తున్నారు. రీటైల్ మార్కెట్‌లో కిలో రూ.20 ప్రకారం విక్రయిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు రైతులు లారీ తీసుకెళ్లి అమ్మకాలు చేస్తుండటం గమనార్హం.
జగన్ హయాంలో ఐదేళ్లూ హ్యాపీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఉల్లి రైతులు ఏ ఒక్క రోజు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఉల్లి సాగు ఎక్కువగా ఉండటంతో పాటు వర్షాలు విస్తారంగా పడటం వల్ల దిగుబడి కూడా పెరిగింది. బంగ్లాదేశ్‌తో పాటు వివిధ దేశాలకు ఎగుమతులు అయ్యాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు ధర లభించింది. రికార్డు స్థాయిలో క్వింటా ఉల్లికి రూ.13,500 వరకు ధర లభించింది. ఆ ఐదేళ్లలో ఉల్లి సాగు చేసిన రైతులకు నష్టాల మాటే తెలియదు.
బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.25పైనే..
ఇక జిల్లాలోనే బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.25పైగా ఉంది. రోడ్లపై రూ.100కు నాలుగు కిలోల ఉల్లి బోర్డుపై రాసి అమ్మకాలు సాగిస్తున్నారు. రైతు బజార్లలోనే కిలో రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్‌లు, మాల్స్‌లో కిలో ధర మరింత ఎక్కువే ఉంటోంది. ఉల్లి పండించే జిల్లాలోనే బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఇలా ఉంటే, ఉల్లి పండించని జిల్లాల్లో ధరలు ఏ విధంగా ఉంటాయే ఊహించుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మాత్రం కిలోకు రూ.12 మాత్రమే కావడం గమనార్హం.
మద్దతు ధర ఎప్పుడు అందుతుందో..?
ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశా. విత్తనాలు కొనడం మొదలు.. పంటను మార్కెట్‌కు తెచ్చే వరకు పెట్టుబడి వ్యయం దాదాపు రూ.2 లక్షల వరకు వచ్చింది. గ్రేడింగ్ చేయగా.. దిగుబడి మాత్రం 100 క్వింటాళ్లు వచ్చింది. ఉల్లిలో నాణ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు క్వింటా రూ.550 ధరతో కొన్నారు. ప్రభుత్వం మాత్రం మద్దతు ధర రూ.1,200 మాత్రమే నిర్ణయించింది.
వ్యాపారులు రూ.550 ప్రకారం కొనగా.. మిగిలిన రూ.650 ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. అదీ ఎప్పటికి పడుతుందో తెలియని పరిస్థితి. మద్దతు ధర రూ.1,200 ఏ మాత్రం గిట్టుబాటు కాదు. రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1.20 లక్షలు చేతికి వస్తోంది. కనీసం రూ.2,000 మద్దతు ధర ఉండాలి. – గోవిందు, బోగోలు, వెల్దుర్తి మండలం
పెట్టుబడిలోనే రూ.40 వేల నష్టం
రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.1.10లక్షల ప్రకారం రూ.2.20 లక్షలు పెట్టుబడి పెట్టాం. దిగుబడి రూ.150 క్వింటాళ్లు వచ్చింది. మార్కెట్‌కు తీసుకరాగా.. వ్యాపారులు క్వింటా రూ.320 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో గ్యాప్ అమౌంటు రూ.980 ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. ఎప్పటికి పడుతుందో తెలియని పరిస్థితి. పెట్టుబడి రూ.2.20 లక్షలు పెడితే ప్రభుత్వ మద్దతు ధరతో లెక్కించినా రూ.1.80 లక్షలు మాత్రమే వస్తోంది. పెట్టిన పెట్టుబడిలోనే రూ.40 వేలు నష్టం వస్తోంది. – పాపన్న, దేవనకొండ