74ను దాటిన రూపాయి! 

Rupee may breach 75 mark against US dollar anytime soon - Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మూడు రోజుల నుంచీ ఏ రోజుకారోజు కొత్త కనిష్ట స్థాయిలకు జారిపోతోంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ శుక్రవారం ఒకదశలో 74.23కు జారింది. అయితే కొంత రికవరీతో 73.76 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో పోలిస్తే ఇది 18 పైసలు పతనం. ఈ రెండు ముగింపులూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. గురువారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి విలువ ఒక దశలో 73.81 స్థాయికి పతనమైనా... తర్వాత కొంత కోలుకుని 73.58 వద్ద ముగిసింది. ఇవి రెండూ గురువారానికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. సోమవారం నుంచీ వరుసగా జరిగిన నాలుగు (మంగళవారం 2వ తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా మార్కెట్‌ సెలవు) ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 128 పైసలు కోల్పోయింది. ఏడాది ప్రారంభం నుంచీ దాదాపు 17% పడింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, దేశం నుంచి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులు, దీనితో కరెంట్‌ అకౌంట్‌ లోటు భయాల వంటివి రూపాయి భారీ పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి పతనం అడ్డుకట్టకు కేంద్రం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాలనూ ఇవ్వడం లేదు. 

ఆర్‌బీఐ పాలసీ కూడా నష్టానికి కారణమే! 
రూపాయి శుక్రవారం 74 దిగువకు పడిపోడానికి ఆర్‌బీఐ పాలసీ విధానమూ కారణమయ్యింది. వివరాల్లోకి వెళితే, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ తన వడ్డీరేట్లను (వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతం) పెంచుతూ వస్తోంది. దీనితో ఈ బాండ్ల రేట్లు తగ్గుతూ, దీనిపై వచ్చే ఈల్డ్స్‌ (వడ్డీ) పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈల్డ్స్‌ నుంచి ప్రయోజనం పొందడానికి దేశంలోని విదేశీ పెట్టుబడులు మార్కెట్‌ నుంచి వెనక్కు వెళ్లడం ప్రారంభించాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి దేశంలోనూ రేటు పెంపు తప్పదని నిపుణులు విశ్లేషించారు. దీనికి భిన్నంగా రేటు యథాతథ స్థితి కొనసాగించడంతో దేశీయ కరెన్సీ సెంటిమెంట్‌ ఒక్కసారిగా దెబ్బతింది. డాలర్లకు డిమాండ్‌ తీవ్రమవడంతో రూపాయి కుదేలయ్యింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top