రిలయన్స్‌ @ రూ.11లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ @ రూ.11లక్షల కోట్లు

Published Thu, Jun 18 2020 3:42 PM

RIL hits fresh record high with market-cap of over Rs 11 lakh crore - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ గురువారం రూ.11లక్షల కోట్లను తాకింది. మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌లో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. మార్కెట్‌ నష్టాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ కంపెనీ షేరు అరశాతానికి పైగా నష్టంతో రూ.1605.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మిడ్‌ సెషన్‌ అనంతరం లభించిన అపూర్వ కొనుగోళ్లతో షేరు ఇంట్రాడే కనిష్టం నుంచి 3.70శాతం లాభపడి రూ.1665.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 2.50 శాతం లాభంతో రూ.1656.25 వద్ద స్థిరపడింది. షేరు సరికొత్త గరిష్టాన్ని నమోదు చేయడంతో కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.11లక్షల కోట్లను అందుకుంది. ఈ ఘనత సాధించిన భారతీయ తొలి కంపెనీగా రికార్డుకెక్కింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు రిలయన్స్‌ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Advertisement