అపారెల్‌ను లాభాల్లోకి తెస్తాం | retail division will be further expanded by the Pokarna Group | Sakshi
Sakshi News home page

అపారెల్‌ను లాభాల్లోకి తెస్తాం

Jan 4 2018 12:27 AM | Updated on Jan 4 2018 12:27 AM

retail division will be further expanded by the Pokarna Group - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్‌... కొత్త ఏడాది సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. నష్టాల్లో ఉన్న అపారెల్‌ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్టాంజా బ్రాండ్‌ ఇమేజ్‌ను మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. అలాగే గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు పూర్వ వైభవం తీసుకొస్తామని పోకర్ణ గ్రూప్‌ సీఎండీ గౌతమ్‌ చంద్‌ జైన్‌ తెలిపారు. క్వార్జ్, అపారెల్‌ విభాగాల్లో కంపెనీ ప్రణాళికలను ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే..

లాభాల్లోకి తీసుకొస్తాం..
గ్రూప్‌ ఆదాయంలో 30 శాతం సమకూర్చిన అపారెల్‌ విభాగం కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు రూ.40 కోట్లకు పైగా వెచ్చించాం. నెదర్లాండ్స్, ఇటలీ, యూఎస్, జర్మనీ కంపెనీలకు థర్డ్‌ పార్టీగా దుస్తులను తయారు చేసి సరఫరా చేశాం. ఉత్పాదన హై క్వాలిటీ కావడం, ఆ కంపెనీలిచ్చే ధర తయారీ ఖర్చు కంటే తక్కువగా ఉండడంతో సరఫరా మానేశాం. దీంతో నిర్వహణ భారం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతం వినియోగానికే పరిమితమయ్యాం. ప్లాంటులో ఉత్పత్తి పెరిగితేనే నష్టాల నుంచి గట్టెక్కుతాం. యూనిట్లో వాటా విక్రయానికి, లేదా లీజుకివ్వటానికి భాగస్వామిని చూస్తున్నాం. రిటైల్‌ను విస్తరిస్తాం కనక తయారీ కూడా పెరుగుతుంది.

స్టాంజా స్టోర్లు పెంచుతాం..
ఒకానొక స్థాయిలో స్టాంజా స్టోర్లు 15 దాకా ఏర్పాటయ్యాయి. కానీ నష్టాలొస్తున్న 7 స్టోర్లను మూసేశాం. ఇపుడున్న ఔట్‌లెట్లలో స్థలాన్ని కుదించాం. రెండేళ్లలో మరో 18 ఔట్‌లెట్లు ప్రారంభిస్తాం. నాణ్యతలో రాజీ లేకుండా సరైన ధరలో ఉత్పత్తులను తెస్తాం. రూ.10 కోట్లుగా ఉన్న అపారెల్‌ విభాగ నష్టాలిపుడు రూ.1–2 కోట్ల స్థాయికి వచ్చాయి. రిటైల్‌ లాభాలు సమకూరుస్తోంది కనక అపారెల్‌ నష్టాలు తగ్గుతూ వచ్చాయి. ఈ విభాగాన్ని త్వరలోనే లాభాల్లోకి మళ్లిస్తాం.

క్వాంట్రాకు ఆదరణ..
నేచురల్‌ క్వార్జ్‌ సర్ఫేసెస్‌ ఉత్పాదన అయిన పోకర్ణ బ్రాండ్‌ ‘క్వాంట్రా’కు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ రంగంలో విజయవంతంగా యూఎస్‌లో అమ్ముడవుతున్న మేడ్‌ ఇన్‌ ఇండియా ప్రొడక్టు మాదే. ఇటలీకి చెందిన బ్రెటన్‌స్టోన్‌ పేటెంటెడ్‌ టెక్నాలజీ వాడుతున్నాం. 200 డిజైన్లు చేస్తున్నాం. పలు దిగ్గజ కంపెనీలకు థర్డ్‌ పార్టీగా కూడా క్వార్జ్‌ సర్ఫేసెస్‌ సరఫరా చేస్తున్నాం. కిచెన్‌ కౌంటర్‌ టాప్స్‌కు అనువైన ఈ ఉత్పాదనను భారత్‌లో ఐకియా కూడా పోకర్ణ నుంచే కొనుగోలు చేయబోతోంది. గ్రూప్‌ టర్నోవరులో క్వార్జ్‌ విభాగం వాటా 50 శాతం దాటింది. ఇందులో క్వాంట్రా 30 శాతం సమకూరుస్తోంది.

హైదరాబాద్‌ వద్దే ప్లాంటు..
గ్రూప్‌ అనుబంధ కంపెనీ అయిన పోకర్ణ ఇంజనీర్డ్‌ స్టోన్‌కు విశాఖపట్నం సమీపంలో నేచురల్‌ క్వార్జ్‌ సర్ఫేసెస్‌ తయారీ ప్లాంటు ఉంది. ఇది పూర్తి స్థాయిలో నడుస్తోంది. మరో ప్లాంటు వస్తేనే కంపెనీ వృద్ధికి ఆస్కారముంది. అందుకే హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో 50 ఎకరాల్లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టాం. ఈ యూనిట్‌కు రూ.325 కోట్లు ఖర్చు చేస్తాం. బ్యాంకు రూ.250 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. న్యాయపర ఒప్పందాలు పూర్తి అయ్యాక 18 నెలల్లో ప్లాంటు రెడీ అవుతుంది. 2019–20లోనే ప్లాంటు కార్యరూపం దాలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement