అంచనాలు తలకిందులు

 RBI holds rates after back-to-back hikes - Sakshi

కీలక పాలసీ రేట్లు యథాతథం

రెపో 6.5; రివర్స్‌ రెపో 6.25 శాతం – ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు

తటస్థం నుంచి కఠినానికి మారిన విధానం

ద్రవ్యోల్బణానికి ఎన్నో సవాళ్లున్నాయి

అక్టోబర్‌–మార్చి అంచనా 3.9–4.5 శాతం

ద్రవ్యలోటుకు కట్టుబడాలి; గాడి తప్పితే ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం

పెరిగే చమురు ధరలు, వాణిజ్య యుద్ధాలు వృద్ధికి విఘాతమని వ్యాఖ్య

తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్‌ 3 నుంచి 5 వరకు...

అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం విశ్లేషకులు, బ్యాంకర్లను అయోమయానికి గురిచేసింది! ఒకపక్క మన కరెన్సీ రూపాయి రోజురోజుకు డాలర్‌ ముందు బక్కచిక్కుతోంది. మరోపక్క అంతర్జాతీయంగా చమురు ధరలు ఉరుముతున్నాయి. ఇంకో పక్క దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఇన్నిరకాల సమస్యలు చుట్టుముట్టిన తరుణంలోనూ... ఆర్‌బీఐ పాలసీ కమిటీ (ఎంపీసీ) 3 రోజులు సమావేశమై... ఒక్క నివారణ చర్య లేకుండా ముగించేయడం ఆశ్చర్యపరిచింది. 

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన జరిగిన ఎంపీసీ కమిటీ నాలుగో ద్వైమాసిక సమావేశం, చివరికి కీలక రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథ విధానాన్నే కొనసాగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. బెంచ్‌మార్క్‌ రెపో రేటు 6.5 శాతాన్ని మార్చాల్సిన అవసరం లేదని మొత్తం ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఓటు వేశారు. రివర్స్‌ రెపో 6.25 శాతంలోనూ మార్పు లేదు. పెరిగే చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతుండటం మన దేశ వృద్ధికి, ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతున్నాయని పేర్కొన్నా... అందుకు తన వైపు నుంచి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం. కాకపోతే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి ‘క్రమంగా కఠినతరం’ (క్యాలిబ్రేటెడ్‌ టైటనింగ్‌)కు మార్చింది. అంటే ఇకపై సమీప భవిష్యత్తులో రేట్ల పెంపే గానీ, తగ్గేందుకు అవకాశాల్లేవని సంకేతాలిచ్చింది. మధ్య కాలానికి ధరల పెరుగుదలను (ద్రవ్యోల్బణాన్ని) 4 శాతానికి నియంత్రించాలన్న విధానానికి కట్టుబడి ఉన్నట్టు మరోసారి పేర్కొంది. నిజానికి కీలక రేటును కనీసం పావు శాతం అయినా పెంచుతారని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. రూపాయి బలహీనత చూసి కొందరయితే... ఈ పెంపు అర శాతం కూడా ఉండొచ్చని అనుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తర్వాత రూపాయి ఫారెక్స్‌ మార్కెట్లో 74 స్థాయిని కోల్పోయింది.

స్టాక్‌ మార్కెట్లు మాత్రం ఆర్‌బీఐ విధానంతో కకావికలం అయ్యాయి. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అస్థిరతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లలో పరిస్థితి కఠినతరం అవుతుండడం మనదేశ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలకు పెద్ద సవాళ్లుగా ఆర్‌బీఐ పేర్కొంది. ఈ తరహా సమస్యల ప్రభావాన్ని తటస్థ పరిచే విధంగా దేశీ స్థూల ఆర్థిక మూలాలు మరింత బలపడాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గానే ఉంటుందని అంచనా  వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6%కి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశాల రక్షణాత్మక విధానాలు, కరెన్సీ యుద్ధాల ముప్పు, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు అన్నవి దేశ ఆర్థిక వృద్ధికి అతిపెద్ద సమస్యలుగా ఎంపీసీ అభిప్రాయపడింది. ఎంపీసీ ఆగస్ట్‌లో జరిగిన సమావేశంలో పాలసీ రేట్లను పావు శాతం పెంచిన విషయం గమనార్హం.
  
రూపాయి ఇప్పటికీ బాగానే ఉంది... 

దేశీయ కరెన్సీ రూపాయి విలువను మార్కెట్‌ శక్తులే నిర్ణయిస్తాయని, ఈ విషయంలో ఆర్‌బీఐకి ఎటువంటి టార్గెట్, బ్యాండ్‌ లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. వర్ధమాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఇప్పటికే మెరుగ్గానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ చివరి నాటికి ఉన్న విదేశీ మారక నిల్వలు 400.5 బిలియన్‌ డాలర్లని, ఇవి పది నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు.  రూపాయి పతనం కొన్ని అంశాల్లో పలు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మోస్తరుగానే ఉందని ఉర్జిత్‌ చెప్పారు.  

ద్రవ్యోల్బణం... 
ద్రవ్యోల్బణం అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో (అక్టోబర్‌–మార్చి) రిటైల్‌ ద్రవ్యోల్బణం  3.9–4.5 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. ఆహార ధరలు ఊహించనంత అనుకూలంగా ఉండడమే కారణం. 2019–20 మొదటి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉండొచ్చని, సమస్యలు ఎదురైతే కొంత అధికంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. మధ్య కాలానికి వినియోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4%కి (2% అటూ, ఇటూగా) తీసుకురావాలన్న లక్ష్యానికి అనుగుణంగానే... క్రమంగా కఠినతరమనే విధానం తీసుకున్నట్టు తెలిపింది.

ద్రవ్యలోటు లక్ష్యాలను దాటితే ప్రమాదమే 
ద్రవ్యలోటు లక్ష్యాలను దాటకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ సూచించింది. లక్ష్యాలు తప్పితే ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం పడడమే కాకుండా, మార్కెట్లలో అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది. ‘‘కేంద్రం లేదా రాష్ట్రాల స్థాయిలో ద్రవ్యలోటు కట్టుతప్పితే అది ద్రవ్యోల్బణ అంచనాలపై, ప్రైవేటు పెట్టుబడులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.  

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ పరిస్థితి కుదుటపడుతుంది 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుందని, పరిస్థితిని ఇది సద్దుమణిగేట్టు చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. పూర్తి నిర్మాణాత్మక సంస్థాగత చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. నూతన యాజమాన్యానికి ఆర్‌బీఐ సహకారం ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ చెప్పారు. స్వల్పకాలిక రుణాలపై అధికంగా ఎన్‌బీఎఫ్‌సీలు ఆధారపడడాన్ని హ్రస్వదృష్టి విధానంగా డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య అభివర్ణించారు. ఇది సంస్థలపైనే కాకుండా వ్యవస్థాగత స్థిరత్వంపైనా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.  

‘‘వరుసగా రెండు సార్లు రేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందన్న అంచనాలే యథాతథ స్థితిని కొనసాగించేందుకు, కఠినతర విధానానికి మళ్లేలా చేశాయి. ప్రతి సమావేశంలోనూ రేట్ల పెంపునకు మేమేమీ కట్టుబడలేదు. ఈ సమయంలో అది అవసరం పడలేదు. ఆర్‌బీఐ, ఎంపీసీ ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. తటస్థ విధానం నుంచి క్రమంగా కఠినతర విధానానికి మళ్లడం ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగేందుకు సమస్యలు పొంచి ఉండడం వల్లే. ఈ విధానంలో రెండే ఆప్షన్లు ఉన్నాయి. రేట్లను పెంచడం లేదా వాటిని స్థిరంగా కొనసాగించడం ’’ 
– ఉర్జిత్‌పటేల్, ఆర్‌బీఐ గవర్నర్‌ 

రూపాయి,  మార్కెట్లకు ఇబ్బందే!  సమస్య తీవ్రమవుతుంది.. 
ఆర్‌బీఐ చర్య ఇబ్బందిని సృష్టించేదే. ప్రస్తుతం రూపాయి పతనాన్ని అడ్డుకోవడం ప్రధానం. రూపాయి బలోపేతం మార్కెట్‌కూ అవసరం. కానీ ఆర్‌బీఐ నిర్ణయం ఈ దిశలో లేదు. రేటు పెంపు లేకపోవడం వల్ల కరెన్సీ, అలాగే ఇతర అసెట్స్‌ మార్కెట్లు తీవ్ర సర్దుబాటుకు  (కరెక్షన్‌) గురయ్యే అవకాశాలున్నాయి. ఫైనాన్షియల్‌ సంక్షోభ సమయాల్లో ఒక్క ద్రవ్యోల్బణం లక్ష్యాలను మాత్రమే చూడ్డం సరికాదు. అయితే ఆర్‌బీఐ పాలసీ వైఖరి మార్చుకోవడం గమనించాలి. వచ్చే నెలల్లో రేటు పెంపు ఉంటుందని ఈ పాలసీ వైఖరి మార్పు తెలియజేస్తోంది.  
– అభీక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ 

అనిశ్చితిని సూచిస్తోంది 
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చితి తీవ్రతను ఆర్‌బీఐ పరిశీలనలోకి  తీసుకుంది. గ్లోబల్‌ ట్రేడ్, ఫైనాన్షియల్‌ స్థిరత్వ పరిస్థితులు బలహీనతకు అవకాశాలు ఉన్నట్లు పాలసీ నిర్ణయాలు సూచిస్తున్నాయి. 
– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌ 

ఆశ్చర్యానికి గురిచేసింది  
రెపోపై ఆర్‌బీఐ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల పెరుగుదల, చమురు ధరలు, అంతర్జాతీయ అనిశ్చితి,  కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యలోటు లక్ష్యాలు కట్టుతప్పే అవకాశాలు దీనికి కారణం.  
– సునీల్‌ మెహతా, ఐబీఏ చైర్మన్‌ 

రియల్టీకి సానుకూలమే 
గడచిన ఆరు నెలల్లో వృద్ధి సంకేతాలను ఇస్తున్న రియల్టీకి తాజా ఆర్‌బీఐ నిర్ణయం మరింత సానుకూలమైనదే. కొనుగోలుదారులకు ఇది ఒక అవకాశం. పండుగల సీజన్, దేశ వ్యాప్తంగా ప్రొపర్టీ రేట్లు దాదాపు తక్కువగానే ఉండడం వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగం సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తున్నాయి.
– జాక్షయ్‌ షా, క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌

ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్‌ఆర్‌ మార్గం 
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్‌ రూట్‌/వీఆర్‌ఆర్‌) ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్‌ఆర్‌ అనే పత్య్రేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక పెట్టుబడుల పరంగా నియంత్రణపరమైన మినహాయింపులు కూడా ఉంటాయి’’ అని ఆర్‌బీఐ తెలిపింది. ఈ వీఆర్‌ఆర్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు అర్హతగా... పెట్టుబడుల్లో కనీస శాతాన్ని, నిర్ణీత కాలం వరకు భారత్‌లో కొనసాగించేందుకు వారు ఎంచుకోవచ్చని ఆర్‌బీఐ వివరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top