పోస్టాఫీసు డిపాజిట్లకు సేవింగ్స్‌ ఖాతాతో పనిలేదు

The Post Office deposits do not work with Savings Account - Sakshi

గత నిర్ణయంపై వెనకడుగు

న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ పథకాలను నిర్వహించే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ఆ శాఖ తీసుకుంది. డిపాజిట్లపై వడ్డీని, కాల వ్యవధి తీరిన తర్వాత డిపాజిట్‌ మొత్తాన్ని పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాల్లోనే డిపాజిట్‌ చేయాలని ఆ శాఖా గతేడాది ఆగస్ట్‌ 3న ఆదేశాలు జారీ చేసింది.

తొలుత జనవరి 15 గడువుగా నిర్ణయించగా, దాన్ని 2018 ఏప్రిల్‌ 1కు పొడిగిస్తూ తర్వాత ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిపాజిట్‌ చేసే వారు ప్రత్యేకంగా సేవింగ్స్‌ ఖాతా కూడా తెరవాల్సి ఉంటుంది.అయితే, దీని పట్ల డిపాజిట్‌దారులు సంతృప్తిగా లేరని ఆ శాఖ గుర్తించింది. ప్రత్యేకంగా బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా తెరిచేందుకు వారు సుముఖంగా లేనందున గత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తపాలా శాఖ గత నెల 23న జారీ చేసిన ఆఫీస్‌ ఆఫ్‌ మెమొరాండంలో పేర్కొంది.

గతేడాది నవంబర్‌ నుంచి పలువురు చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులు కాల వ్యవధి తీరిన తమ డిపాజిట్ల కోసం సేవింగ్స్‌ ఖాతాలను తెరిచేందుకు నిరాకరించడం వంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తపాలా శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోస్టల్‌ డిపాజిట్‌ దారులు ఆధార్‌ సమర్పించాల్సిన గడువును కూడా నిరవధికంగా కొనసాగిస్తూ ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top