17 రోజుల్లో 14 సార్లు పెంపు

Petrol, Diesel Prices Hiked 14 Times In 17 Days - Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకి పైపైకి ఎగుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పైకి ఎగిశాయి. ఢిల్లీలో పెట్రోల్‌ ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరగా.. డీజిల్‌ ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. గత 17 రోజుల్లో ఇప్పటి వరకు 14 సార్లు ఈ ధరలు పెరిగినట్టు తెలిసింది. 2018 మార్చి 18 నుంచి కొనసాగింపుగా ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయని వెల్లడైంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం నేడు పెట్రోల్‌ ధరలు ఢిల్లీలో లీటరు రూ.73.95 ఉండగా.. కోల్‌కత్తాలో రూ. 76.66గా, ముంబైలో రూ.81.8గా, చెన్నైలో రూ.76.72గా రికార్డయ్యాయి. డీజిల్‌ ధరలు కూడా ఢిల్లీలో లీటరుకు రూ.64.82గా, కోల్‌కత్తాలో రూ.67.51గా, ముంబైలో రూ.69.02గా, చెన్నైలో రూ.68.38గా నమోదయ్యాయి. 

2017 జూన్‌లో రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోగా.. పెరుగుతూనే ఉన్నాయి.క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో పాటు, రూపాయి-డాలర్‌ ఎక్స్చేంజ్‌ రేటు, దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని తెలిసింది. గ్లోబల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు చేరుకుంది. మంగళవారం కూడా అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రల్‌, డీజిల్‌ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకున్నాయని వెల్లడైంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు గరిష్టాలను చేరుతుండటంతో, వెంటనే ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వెనువెంటనే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంపై విముఖత వ్యక్తం చేస్తోంది. గ్లోబల్‌గా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పుడు 2014 నవంబర్‌ నుంచి 2016 జనవరి మధ్య కాలంలో తొమ్మిది  సార్లు ఎక్సైజ్‌ డ్యూటీలు పెంచిన ప్రభుత్వం, ధరలు పెరుగుతున్నప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రమే ఎక్సైజ్‌ డ్యూటీను తగ్గించింది. దీంతో ఎక్సైజ్‌ డ్యూటీలను తగ్గించకుండా... వినియోగదారులపై భారం మోపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top