హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్

Published Fri, May 2 2014 1:09 AM

హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్ - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసులందిస్తున్న ఓలా క్యాబ్స్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. మే మూడో వారంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సిటీ ట్యాక్సీ, ఔట్ స్టేషన్, లోకల్ రెంటల్స్ ఇలా మూడు విభాగాలుగా సేవలు అందిస్తామని చెప్పారు. కంపెనీ తొలి విడతగా 200-250 కార్లను ప్రవేశపెడుతోంది. తొలుత సెడాన్ కార్లను అందుబాటులోకి తేనున్నారు. రానున్న రోజుల్లో ప్రీమియం విభాగంలో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను పరిచయం చేయనున్నారు. పగలు, రాత్రి... ఏ సమయంలో బుక్ చేసినా ఒకే రకమైన చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుతోసహా ఏడు నగరాల్లో ఓలా సేవలందిస్తోంది. 9,000 పైగా కార్లున్నాయి. రోజుకు 15 వేలకుపైగా కాల్స్ అందుకుంటోంది. ఓలా మినీ పేరుతో చిన్న కార్లతో సేవలందిస్తోంది కూడా. వీటికి రూ.100 కనీస చార్జీ. 6 కిలోమీటర్ల తర్వాత కి.మీ.కు రూ.13 చార్జీ ఉంటుంది. ఇక లగ్జరీ కార్లకు కనీస చార్జీ రూ.200. 2 కిలోమీటర్ల తర్వాత కారు మోడల్‌నుబట్టి చార్జీ వసూలు చేస్తారు.

 ఇద్దరు యువకులు..: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా క్యాబ్స్‌ను భవీష్ అగర్వాల్, అంకిత్ భాటి ప్రారంభించారు. వీరిద్దరూ ఐఐటీ ముంబైలో చదువుకున్నవారే. జనవరి 2011న ఓలా ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే క్యాబ్ సేవల్లో దేశంలో అతి పెద్ద సంస్థగా ఎదిగింది. 9,000 కార్లలో ఒక్కటి కూడా సంస్థ సొంతం కాదు. ఔత్సాహిక యువకులకు కార్లను ఇప్పించి, వాటిని సంస్థ బ్రాండ్‌పైన వినియోగిస్తోంది. బుకింగ్స్ ఆధారంగా డ్రైవర్లకు చెల్లింపులు జరుపుతారు. ఆసక్తికర అంశమేమంటే ఓలా క్యాబ్స్ అప్లికేషన్ ద్వారా కారును బుక్ చేసుకుంటే.. ప్రయాణికుడు ఎక్కడున్నా జీపీఎస్ ఆధారంగా డ్రైవరుకు ఇట్టే తెలిసిపోతుంది.

Advertisement
Advertisement