ఈ ఏడాదే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ

NSE expects to get listed by FY19 - Sakshi

కోల్‌కతా: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రానున్నదని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓ లిమాయే చెప్పారు. కో–లొకేషన్‌ సర్వర్‌ సంబంధిత వివాదం త్వరలో పరిష్కారమవ్వగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ఐపీఓకు అడ్డంకిగా ఉన్న ఈ వివాదం సమసిపోగానే ఐపీఓకు వస్తామని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తమ ఐపీఓ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు.

కోల్‌కతాలో జరిగిన ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై పైలట్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నామని, సోషల్‌ మీడియా డేటా, ట్రేడింగ్‌ పోకడలపై నిఘాకు కృత్రిమ మేధ వినియోగంపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. ఎక్సే్చంజ్, ఇతర వ్యాపారాల కోసం కంపెనీల కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కాగా, కో–లొకేషన్‌ సర్వర్‌ సంబంధిత విషయమై మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ, సీబీఐలు విచారణ జరుపుతున్న నేపథ్యంలో రూ.10,000 కోట్ల ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ జాప్యం అవుతోంది. మామూలుగానైతే ఈ ఐపీఓ ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చి మధ్య రావలసి ఉంది. ఎన్‌ఎస్‌ఈ కో–లొకేషన్‌ సర్వర్‌ను కొందరు బ్రోకర్లు అక్రమంగా యాక్సెస్‌ చేసుకొని లబ్ధిపొందారన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరుగుతోంది.

ఓలా నష్టం పెరిగింది..
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలా నష్టాలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో మరింతగా పెరిగాయి. రూ. 4,898 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టాలు రూ. 3,148 కోట్లు. తాజాగా ఆదాయం 70% పెరిగి రూ. 811 కోట్ల నుంచి రూ. 1,381 కోట్లకు చేరాయి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ)కి దాఖలు చేసిన పత్రాల ప్రకారం కంపెనీ ప్రకటన వ్యయాలు 35 శాతం తగ్గగా, ఉద్యోగులపై వ్యయాలు 24 శాతం పెరిగాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top