డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే! 

Nirmala Sitharaman Comments On Insurance Enhancement Act on Deposits - Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే, కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని శాఖలను ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 18 (సోమవారం) నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  

ఏ ఒక్క కంపెనీ వెళ్లిపోకూడదు.. 
టెలికం కంపెనీల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘ఏ కంపెనీ కూడా కార్యకలాపాలను మూసివేయాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కార్యకలాపాలు కొనసాగించాలి. వ్యాపారాల్లో ఎన్నో కంపెనీలు కొనసాగే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటున్నాం. ఒక్క టెలికం రంగమే కాదు.. ప్రతీ రంగంలోనూ ప్రతీ కంపెనీ కొనసాగాలన్నదే నా అభిలాష’’ అని మంత్రి బదులిచ్చారు. టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు సెక్రటరీలతో ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే భవిష్యత్తులో అదనపు పెట్టుబడులు పెట్టడం అసాధ్యమంటూ వొడాఫోన్‌ ఐడియా కంపెనీ పేర్కొన్న విషయం తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top