స్థానిక భాషలో సామాజిక మాధ్యమం!

స్థానిక భాషలో సామాజిక మాధ్యమం!


మాతృభాషలో వినియోగించుకునే వీలుండే షేర్‌చాట్

ప్రస్తుతం తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో..

నెల రోజుల్లో తమిళం, గుజరాతీ భాషలకు విస్తరణ

రూ.10 కోట్ల నిధుల సమీకరణ

‘సాక్షి స్టార్టప్ డైరీ’తో షేర్ చాట్ సీఈఓ ఫరీద్ హెసన్


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : 125 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 30 కోట్ల లోపే. ఇందులో సామాజిక మాధ్యమాల యూజర్లు 15 కోట్ల కిందే. మరి ఇంత గ్యాప్ ఎందుకుంది? ఏ సోషల్ నెట్‌వర్కింగ్‌నైనా ఆంగ్లంలో వినియోగించాలనేది ఒక కారణమైతే! మెట్రో యువతతో పోల్చుకుంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువత ఇంగ్లిష్‌లో వెనకబడి ఉండటం మరో కారణం!! మరి రోజూ మనం మాట్లాడుకునే భాషల్లో సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వీలుంటే? ఎంచక్కా మాతృ భాషలో స్పందిస్తూ.. ఎప్పుడూ ఇతరులతో టచ్‌లో ఉంటూ ఎంజాయ్ చేయొచ్చు కదూ!! ఇదిగో ఇలాంటి సోషల్ నెట్‌వర్కింగ్ యాపే ‘షేర్‌చాట్’! యాప్ విశేషాలు, విస్తరణ ప్రణాళికల గురించి షేర్‌చాట్ సీఈఓ ఫరీద్ హెసన్ మాటల్లోనే..


 నాతో పాటూ అంకుష్ సచ్‌దేవ్, భాను సింగ్‌లు ముగ్గురం ఐఐటీ కాన్పూర్ గ్రాడ్యుయేట్స్. ఇంగ్లిష్‌లో కంటే స్థానిక భాషలో సామాజిక మాధ్యమాలను వినియోగించే వీలుంటే చాలా మందికి  చేరుతుందని అనుకున్నాం. అందుకే లక్ష రూపాయల పెట్టుబడితో ఆరు నెలలపాటు యాప్, సాఫ్ట్‌వేర్, ఫీచర్లను అభివృద్ధి చేసి గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షేర్‌చాట్ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ను విడుదల చేశాం. షేర్ ప్రత్యేకత ఏంటంటే..  యూజర్లు తమ స్థానిక భాషలోనే కంటెంట్ పొందొచ్చు. పోస్ట్ చేయవచ్చు కూడా. ఫొటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ మీ భాషలోనే చేసుకునే వీలుంది. వీటికి తోడు న్యూస్, విషెస్, ఇతరుల కంటెంట్, ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు ఫాలో కావొచ్చు.


నెలాఖరుకల్లా తమిళం, గుజరాతీలో..

ప్రస్తుతం తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం భాషల్లో షేర్‌చాట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి బెంగాళీ, కన్నడ, పంజాబీ, ఒడియా భాషలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి విడత ఈ నెలాఖరుకల్లా గుజరాతీ, తమిళ భాషలకు విస్తరించనున్నాం. ఫీచర్ల విషయానికొస్తే.. చాటింగ్, కామెంట్ ఫీచర్లనూ అందుబాటులోకి తెస్తున్నాం.

 


 రూ.10 కోట్ల నిధుల సమీకరణ..

ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే కాలిఫోర్నియాలో జరిగిన గూగుల్ లాంచ్‌ప్యాడ్ యాక్సలేటర్ కార్యక్రమానికి ఎంపికయ్యాం. మన దేశం తరపున ఎంకికైన ఏకైక యాప్ మాదే. ఇందులో 50,000 డాలర్ల నగదు బహుమతితో పాటూ 6 నెలల మెంటార్‌షిప్ కూడా ఇస్తారు. ఇటీవలే సైఫ్ పార్టనర్స్ నుంచి రూ.10 కోట్లు నిధులను సమీకరించాం. మరో మూడు నెలల్లో కొత్త ఇన్వెస్టర్ల నుంచి మరికొంత నిధుల సమీకరణ కూడా చేయనున్నామని ఫరీద్ వివరించారు.


రోజుకు 2 లక్షల షేరింగ్స్

ప్రస్తుతం షేర్‌చాట్‌కు 12 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో సగానికి పైగా యాక్టివ్ యూజర్లే. నెలకు 4 లక్షల మంది కొత్తగా యాడ్ అవుతున్నారు. రోజుకు 2 లక్షల కంటెంట్స్ షేరింగ్ అవుతున్నాయి. మొత్తం యూజర్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి 5 లక్షల యూజర్లున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యాప్ మాత్రమే అందుబాటులో ఉంది. నెల రోజుల్లో ఐఓఎస్ యాప్‌నూ అందుబాటులోకి తీసుకొస్తాం.


అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే  startups@sakshi.com కు  మెయిల్ చేయండి...

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top