భావోద్వేగానికి లోనైన ముఖేష్‌ అంబానీ

Mukesh Ambani Gets Emotional In Isha Ambani Wedding - Sakshi

సాక్షి, ముంబై : భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ- పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన వివాహ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ సహా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు హాజరై సందడి చేశారు.

గుజరాతీ సం‍ప్రదాయం ప్రకారం జరిగిన ఇషా- ఆనంద్‌ల పెళ్లి తంతులో భాగంగా... పెళ్లికుమార్తె ఇషాను ఆమె సోదరులు ఆకాశ్‌, అనంత్‌, అన్‌మోల్‌ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్‌ పట్టి మండపానికి తీసుకురాగా.... నృత్య కళాకారులతో బారాత్‌ బృందం ముందు వస్తుండగా.. రోల్స్‌ రాయిస్‌ కారులో వరుడు ఆనంద్‌‌, తన  కుటుంబసభ్యులతో కలిసి అంటిలియాకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇషా-ఆనంద్‌లు పెళ్లి వేదిక వద్దకు చేరుకోగానే వధువు- వరుడి బంధువుల కోలాహలంతో అక్కడ సందడి నెలకొంది. ఇరువర్గాల ఆనందోత్సహాల మధ్య వారిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

కాగా కన్యాదానం సమయంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌.. మంత్రాలకు సంబంధించిన పరమార్థం చెబుతుండగా... అంబానీ దంపతులు తమ ముద్దుల కూతురిని అల్లుడి చేతిలో పెట్టారు. అయితే ఈ సమయంలో ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయినా అపర కుబేరుడు అయితేనేం ముఖేష్‌ అంబానీ కూడా ఓ ఆడపిల్ల తండ్రే కదా. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురుని మెట్టింటికి పంపిస్తున్నపుడు ఆమాత్రం ఉద్వేగానికి గురవడం సహజమే. ఈ విషయంలో సగటు భారతీయ తండ్రికి తానేమీ అతీతుడిని కాదని నిరూపించుకున్నారు అంబానీ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top