ట్రంప్‌ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు

Mini trade deal expected during Trump visit - Sakshi

మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ‘మినీ’ వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు పునాదిలాగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నట్లు దేశీ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ చెప్పారు.

ఇరు దేశాల వాణిజ్య వర్గాలు దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయని అసోచాం సెక్రటరీ జనరల్‌ దీపక్‌ సూద్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్‌.. ఈ సందర్భంగా రౌండ్‌ టేబుల్‌ సదస్సులో పలువురు కార్పొరేట్‌ దిగ్గజాలతో భేటీ కానున్నారు. అమెరికన్‌ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్‌ అధికారులతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్, టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్, బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా తదితరులు ఇందులో పాల్గొనున్నారు.

వివాదాల పరిష్కారంపై దృష్టి..
ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి రెండు దేశాల మధ్య కొన్ని అంశాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఎగుమతి చేసే కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధి క సుంకాలు విధిస్తోంది. అలాగే, జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (జీఎస్‌పీ) కింద ఎగుమతి సంస్థలకు ఒనగూరే ప్రయోజనాలు ఎత్తివేసింది. వీటన్నింటినీ పునఃసమీక్షించాలని దేశీ కంపెనీలు కోరుతున్నాయి. అలాగే, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంజినీరింగ్, ఆటో పరికరాలు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా మార్కెట్లో మరిన్ని అవకాశాలు కల్పించాలంటున్నాయి.

మరోవైపు, భారత్‌లో తమ వ్యవసాయ, తయారీ రంగ ఉత్పత్తులు, వైద్య పరికరాల విక్రయానికి తగిన అవకాశాలు కల్పించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ భారత పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐఐ అంచనాల ప్రకారం .. దాదాపు 100 పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్‌ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్‌ చేశాయి. 1.13 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాయి. 20 18–19లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 35.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2017–18లో 21.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరంలో 16.9 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top