ఎప్పుడు కావాలంటే అప్పుడు గిఫ్ట్‌ | midnight cake.com for gifts and birthday cakes delivery startup company | Sakshi
Sakshi News home page

ఎప్పుడు కావాలంటే అప్పుడు గిఫ్ట్‌

Mar 11 2017 12:53 AM | Updated on Sep 5 2017 5:44 AM

ఎప్పుడు కావాలంటే అప్పుడు గిఫ్ట్‌

ఎప్పుడు కావాలంటే అప్పుడు గిఫ్ట్‌

ఆత్మీయుల పుట్టిన రోజునో లేక పెళ్లి రోజునో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి కేకో లేక ఫ్లవర్సో పంపి సర్‌ప్రైజ్‌ చేస్తే?

అర్ధరాత్రి గిఫ్ట్స్‌ డెలివరీ చేసి సర్‌ప్రైజ్‌ చేస్తున్న మిడ్‌నైట్‌కేక్‌
కేకులు, ఫ్లవర్స్, చాక్లెట్స్, బొమ్మల వంటివెన్నో..
నెలకు 500 పైనే ఆర్డర్లు; రూ.50 లక్షల టర్నోవర్‌
3 నెలల్లో రూ.5 కోట్లు సమీకరణ పూర్తి
‘స్టార్టప్‌ డైరీ’తో సంస్థ ఫౌండర్‌ మలాయ్‌ శిరాసియా


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆత్మీయుల పుట్టిన రోజునో లేక పెళ్లి రోజునో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి కేకో లేక ఫ్లవర్సో పంపి సర్‌ప్రైజ్‌ చేస్తే? ఇలాంటి సీన్లు సినిమాల్లో తప్ప నిజజీవితంలో చాలా అరుదుకదూ. కానీ, వాటిని మేంనిజం చేస్తామంటోంది మిడ్‌నైట్‌కేక్‌.కామ్‌! చెప్పిన చోటుకి, చెప్పిన సమయంలో గిఫ్ట్‌లను డెలివరీ చేస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తోంది. సంస్థ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే వేడుక మీది.. సంతోషం మాది అంటున్నారు సంస్థ ఫౌండర్‌ మలాయ్‌ శిరాసియా. మరిన్ని విశేషాలను ‘సార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ఓ సంవత్సరం నా పుట్టిన రోజుకు అర్ధరాత్రి 12 గంటలకు నా ప్రాణ స్నేహితుడు రూమ్‌కి కేక్‌ తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ టైంకి కేక్‌ ఎక్కడ దొరికిందిరా అనడిగా? సాయంత్రమే కొని పెట్టానని సమాధానమిచ్చాడు. ప్రత్యేక వేడుకలకు రాత్రి సమయాల్లో కేకులు, చాక్లెట్స్, గిఫ్టŠస్‌ వంటివి డెలివరీ చేసే సంస్థ ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకున్నాం. ఆ చర్చలోంచే 2012లో అహ్మదాబాద్‌ కేంద్రంగా మిడ్‌నైట్‌కేక్‌.కామ్‌ పుట్టింది.

146 నగరాల్లో 200 మంది వెండర్లు..
బేకరీ, గిఫ్ట్‌ ఆర్టికల్‌ వెండర్స్‌తో ఒప్పందం చేసుకొని కస్టమర్లు కోరిన సమయంలో గిఫ్ట్‌లను పంపించడం మా పని. పెళ్లి, పుట్టిన రోజులకే కాదు పండుగలు, ప్రేమికుల రోజు, న్యూ ఇయర్‌ వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ గిఫ్ట్‌లను పంపించొచ్చు. కేక్స్, ఫ్లవర్స్, చాక్‌లెట్స్, గ్రీటింగ్‌ కార్డ్స్, టెడ్డీబీర్‌ వంటివి పంపించి ఆత్మీయులను ఆనందాన్ని పంచొచ్చు. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్‌ వంటి దేశంలోని 146 నగరాల్లో సేవలందిస్తున్నాం. 200 మంది వెండర్లు మాతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి 5 మంది వెండర్స్‌ ఉన్నారు. కస్టమర్లు మా వెబ్, యాప్‌లో ఆర్డర్‌ ఇవ్వగానే అందుబాటులో ఉన్న వెండర్‌కు కనెక్ట్‌ చేస్తాం. ప్రతి ఆర్డర్‌ మీద వెండర్‌ నుంచి 10–20% వరకు కమీషన్‌ తీసుకుంటాం.

11 వేల మందికి సేవలు..: అహ్మదాబాద్, పుణె నగరాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా డెలివరీ బాధ్యత వెండర్‌దే. త్వరలోనే పలు డెలివరీ సంస్థలతో ఒప్పందం చేసుకొని అన్ని నగరాల్లో డెలివరీ బాధ్యతలను తీసుకుంటాం. రాత్రి 11.30–12 గంటల మధ్య డెలివరీ చేయడంతో పాటూ పగలు సమయాల్లోనూ డెలివరీ చేస్తాం. డోర్‌ డెలివరీలే కాదు పీఎన్‌ఆర్‌ నంబర్, పేరులను జత చేస్తే రైల్వే స్టేషన్‌కు వెళ్లి కూడా గిఫ్ట్‌లను అందిస్తాం. ఇప్పటివరకు 11 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి 2 వేల మంది యూజర్లున్నారు. నెలకు 500 ఆర్డర్లొస్తున్నాయి. ప్రతి నెలా 10% వృద్ధిని నమోదు చేస్తున్నాం.

రూ.5 కోట్ల నిధుల సమీకరణ..
గతేడాది ఆర్ధిక సంవత్సరంలో రూ.36 లక్షల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే రూ.50 లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ‘‘ప్రస్తుతం మా సంస్థలో ఐదుగురు ఉద్యోగులున్నారు. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిసారించాం. 3 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని’’ శిరాసియా వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement