ఫేస్‌బుక్‌ నడపడానికి నేనే కరెక్ట్‌ వ్యక్తిని!

Mark Zuckerberg Says He Is Right Person To Be Facebook CEO - Sakshi

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ మరోసారి మీడియాతో మాట్లాడారు. గత నెలలో బయటపడిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా-ఫేస్‌బుక్‌ స్కాండల్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడటం ఇది నాలుగో సారి.  ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ సీఈవోగా తానే సరియైన వ్యక్తినని మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఉద్ఘాటించారు. ఫేస్‌బుక్‌ను లీడ్‌ చేయడానికి మీరు సరియైన వ్యక్తేనా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. దీన్ని నడపడానికి తానే సరియైన వ్యక్తినని, దీన్ని నడపడానికి ఎవరూ కూడా సరితూగరని పేర్కొన్నారు. 

తప్పు జరిగినట్టు ఒప్పుకున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌, దీన్ని లీడ్‌ చేసే కరెక్ట్‌ వ్యక్తిని తానేన​న్నారు. తప్పుల నుంచే జీవితం గురించి నేర్చుకుంటామని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ముందుకు సాగడానికి ఏం కావాలో తెలుసుకోవాలన్నారు. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ తన యూజర్ల డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు చేరవేసిందనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తాయి. ఈ స్కాండల్‌పై తప్పు జరిగినట్టు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కూడా ఒప్పుకున్నారు. దీంతో ఫేస్‌బుక్‌ను నడిపేందుకు మార్క్‌ జుకర్‌బర్గ్‌ సరియైన వ్యక్తి కాదంటూ పలువురు వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఫేస్‌బుక్‌ను నడపడానికి తానే సరియైన వ్యక్తినని పేర్కొన్నారు. 

ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సీఈవోలతో పోలిస్తే, జుకర్‌బర్గ్‌ చాలా చిన్నవారు. ఫేక్‌న్యూస్‌, ప్రైవసీ విషయంలో గత కొన్నేళ్లుగా ఆయన పలు వివాదాస్పద ప్రకటనలు కూడా చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌ బయటపడింది. దీంతో ఫేస్‌బుక్‌ షేర్లు కూడా భారీగా కిందకి పడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా పలు రెగ్యులేటర్లు ఫేస్‌బుక్‌పై విచారణ జరుపుతున్నాయి. ఫేస్‌బుక్‌ ప్రైవసీ, డేటా పాలసీలపై తమకు ఏప్రిల్‌ 11న వివరణ ఇవ్వాలని అమెరికా చట్టసభ్యులు మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ఆదేశించారు కూడా. అయితే బోర్డు నుంచి తప్పుకోవాలని తనకు ఎలాంటి కాల్స్‌ రాలేదని కూడా జుకర్‌బర్గ్‌ తెలిపారు. దీని వల్ల కంపెనీ ఎవర్ని తొలగించదని కూడా చెప్పారు. ‘నేను ఇక్కడే ప్రారంభించా. ఇక్కడే నడిపా. జరిగిన దానికే నేనే బాధ్యుడిని. తప్పు నుంచి నేర్చుకున్న పాఠాలతో మున్ముందు మరింత మెరుగ్గా నా బాధ్యతను నిర్వర్తిస్తా. కానీ ఎవరిపైనా నిందను మోపడానికి నేను సిద్ధంగా లేను’ అని జుకర్‌బర్గ్‌ అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top