హోలీ @ మేడిన్ చైనా! | 'Made in China' products hitting local companies during Holi: Assocham | Sakshi
Sakshi News home page

హోలీ @ మేడిన్ చైనా!

Mar 25 2016 12:24 AM | Updated on Sep 3 2017 8:29 PM

హోలీ @ మేడిన్ చైనా!

హోలీ @ మేడిన్ చైనా!

మేకిన్ ఇండియా.. మేకిన్ ఇండియా అంటూ మనవాళ్లు ఎంతగా ఊదరగొడుతున్నా.. ‘మేడిన్ చైనా’ ఉత్పత్తుల హవానే కొనసాగుతోంది.

దేశీ ఉత్పత్తుల కన్నా చైనా నుంచి దిగుమతైన వాటికే డిమాండ్
రేట్ల మధ్య 55% వ్యత్యాసమే కారణం
అసోచాం సర్వేలో వెల్లడి

లక్నో: మేకిన్ ఇండియా.. మేకిన్ ఇండియా అంటూ మనవాళ్లు ఎంతగా ఊదరగొడుతున్నా.. ‘మేడిన్ చైనా’ ఉత్పత్తుల హవానే కొనసాగుతోంది. తాజాగా రంగుల పండుగ హోలీలో కూడా ఇదే ధోరణి కనిపించింది. దేశీ సంస్థలు తయారు చేసిన హోలీ రంగులు, పిచికారీలు, బెలూన్లు మొదలైన వాటికంటే.. చైనా నుంచి దిగుమతైన వాటికే ఎక్కువగా డిమాండ్ నెలకొంది. రెండింటి మధ్య వ్యత్యాసం దాదాపు 55 శాతం పైగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. చైనా నుంచి వచ్చిపడుతున్న చౌక దిగుమతులతో చిన్న తయారీ సంస్థల మనుగడ కష్టంగా మారుతోందని అసోచాం పేర్కొంది. దేశీ సంస్థలు తయారు చేసే ఉత్పత్తుల్లో కేవలం 25 శాతం వాటికే కొనుగోలుదారులు ఉంటున్నారని, మిగతా 75 శాతాన్ని అవి నష్టపోవాల్సి వస్తోందని వివరించింది. హోలీ రంగులు, వాటర్ గన్‌లు తత్సంబంధిత ఇతర ఉత్పత్తులు తయారు చేసే దాదాపు 250 పైగా సంస్థలు, విక్రేతలు, సరఫరాదారులు, ట్రేడర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా అసోచాం ఈ నివేదిక రూపొందించింది.

 హానికరమైన పదార్థాలతో తయారీ..
చైనా నుంచి దిగుమతైన హోలీ రంగులు, స్ప్రింక్లర్ల ధరలు దేశీయంగా తయారైన వాటికంటే దాదాపు 55 శాతం చౌకగా దొరుకుతున్నాయని నివేదికను విడుదల చేసిన సందర్భంగా అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. వినియోగదారుల్లో ఆసక్తి లేకపోవడంతో దేశవాళీ సంప్రదాయ పిచికారీలు దాదాపు కనుమరుగైపోయాయని వివరించారు.  చైనా నుంచి దిగుమతయ్యే చౌక వాటర్ గన్స్ మొదలైన వాటి తయారీలో చర్మానికి హాని చేసే యాసిడ్స్, డీజిల్, ఇంజిన్ ఆయిల్, గాజు పౌడరు, మైకా వంటి హానికారక పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అసోచాం సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.

ఇలాంటి ప్రమాదకరమైన పదార్థాలతో తయారైనప్పటికీ చౌకగా దొరుకుతుండటం వల్ల చైనా ఉత్పత్తుల వైపే కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మెరుగైన హెర్బల్ రంగులనే తయారు చేస్తున్నప్పటికీ.. ముడి వస్తువుల ధర పెరిగిపోవడంతో వీటి రేట్లు కాస్త ఎక్కువే నిర్ణయించక తప్పడం లేదని పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగా చైనా చౌక దిగుమతులతో పోలిస్తే తమ ఉత్పత్తులకు కష్టంగా ఉంటోందని వివరించారు. అసోచాం అంచనా ప్రకారం దేశీయంగా 5,000 పైచిలుకు రంగుల తయారీ యూనిట్లు, అయిదు లక్షల కిలోల పైచిలుకు ‘గులాల్’ రంగును తయారు చేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఏకంగా రెండు లక్షల కిలోల గులాల్‌ను వినియోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement