మైండ్‌ ట్రీకి ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌

L&T buys 25,000 more shares of Mindtree - Sakshi

రూ.5,030 కోట్లు వెచ్చించే అవకాశం

ఒక్కో షేర్‌ రూ.980 ధరకు కొనుగోలు

ఈ నెల 17న మొదలై 28న ముగింపు

న్యూఢిల్లీ: మైండ్‌ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్‌ అండ్‌ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా మైండ్‌ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్‌ ట్రీ షేర్‌ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్‌ చేస్తోంది. ఈ ఓపెన్‌ ఆఫర్‌ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారమైతే ఈ ఓపెన్‌ ఆఫర్‌ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్‌ ఆఫర్‌లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్‌– లైట్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్‌ ట్రీ కంపెనీని ఎల్‌ అండ్‌  టీ కొనుగోలు చేస్తోంది.  

మొత్తం రూ.10,700 కోట్లు...
ఎల్‌ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్‌ ట్రీలో 35.15  శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్‌ ఆఫర్‌ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్‌ అండ్‌ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్‌ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్‌  అండ్‌ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్‌ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్‌ అండ్‌ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top