
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ సేవల సంస్థ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో (ఆర్‌ఈఈఎల్) అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం కేకేఆర్ 60 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.3,630 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇదివరలోనే ఈ మేరకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదరగా... ఈ లావాదేవీ ప్రక్రియ సోమవారం పూర్తయినట్లు ఇరు కంపెనీల ప్రతినిధులూ ప్రకటించారు. రామ్‌కీ ఎన్విరోలో ప్రైమరీ, సెకండరీ పెట్టుబడులు కలిపి రూ.3,630 కోట్లను కేకేఆర్ ఇన్వెస్ట్ చేసింది. గ్లోబల్ ఇంపాక్ట్ స్ట్రాటజీలో భాగంగా కేకేఆర్ ఏసియన్ ఫండ్–3 నుంచి ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు కేకేఆర్ ఎండీ రూపేన్ ఝవేరీ తెలియజేశారు.
సామాజికంగా, పర్యావరణ పరంగా ప్రభావాన్ని చూపించగలిగే వ్యాపారాలను గుర్తించడం, పెట్టుబడులు పెట్టడం కోసం గ్లోబల్ ఇంపాక్ట్ స్ట్రాటజీని ఏర్పాటు చేశామని ఝవేరీ చెప్పారు. ప్రపంచంలోనే వ్యర్థాల నిర్వహణ అవసరం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని... ఈ విషయంలో దేశవ్యాప్తంగా పరిష్కారాలను, సేవలను అందిస్తూ రామ్‌కీ కీలక పాత్ర పోషిస్తున్నదని రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ, సీఈఓ ఎం.గౌతమ్ రెడ్డి చెప్పారు. పర్యావరణ సవాళ్లకు ప్రభావశీలమైన పరిష్కారాలను అందించడంలో, సానుకూల మార్పు తీసుకురావాలనే భావ సారూప్యత కారణంగా కేకేఆర్ సంస్థ తమకు మంచి భాగస్వామి కాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో దేశంలోనే ఇది అతిపెద్ద డీల్ అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.