జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌

Jio Takes On Airtel With New Double Dhamaka Offer - Sakshi

టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్తగా డబుల్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ఎయిర్‌టెల్‌ ఈ అదనపు డేటాను ఎంపిక చేసిన యూజర్లకు ఇస్తే, జియో తన యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్‌ ధమాకా ఆఫర్‌తో పాటు, ఈ ఆపరేటర్‌ కొత్తగా రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాక్‌పై రోజుకు 3.5 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.

కొత్త జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌..

  • రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు. 
  • రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం.
  • రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు. 
  • రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం. 
  • రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు. 

దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌ల కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్స్‌ యాక్సస్‌ను పొందవచ్చు. మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. ఈ ఆపరేటర్‌ గతేడాది డిసెంబర్‌లో రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్‌ ధరను రూ.449కు తగ్గించింది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top