భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు!

భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు!


► ఇన్వెస్ట్‌మెంట్‌ గురు.. వారెన్‌ బఫెట్‌ వ్యాఖ్యలు

► అపార అవకాశాలున్న మార్కెట్‌...

► అవకాశం లభిస్తే పెట్టుబడులకు రెడీ..




న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో లెజండరీగా పేర్కొనే వారెన్‌ బఫెట్‌ భారత్‌ను అపార అవకాశాలున్న మార్కెట్‌గా అభివర్ణించారు.  అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు చక్కని అవకాశం కనిపిస్తే వెంటనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘‘భారత్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ అద్భుతమైన కంపెనీ ఉంటే చెప్పండి. రేపటికల్లా అక్కడే ఉంటాను’’ అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో  అన్నారు. మార్కెట్‌ పట్ల కాకుండా కంపెనీ వ్యాపారాలపై దృష్టి పెట్టాలంటూ ఇన్వెస్టర్లకు ఓ సక్సెస్‌ మంత్రాన్ని బోధించారు.



భవిష్యత్తు అద్భుతం: ‘‘భారత్‌లో భవిష్యత్‌ తరం అంతా ఇప్పటి కంటే మరింత గొప్పగా జీవించగలుగుతారు. మేథో సామర్థ్యాల దృష్ట్యా భారత్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది’’ అని బఫెట్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణుల గురించి ఆయన మాట్లాడారు. భారత్‌లోని ఐఐటీ ఇంజనీర్లను మాత్రమే తాను నియమించుకుంటానంటూ లోగడ మైక్రోసాఫ్ట్‌ యజమాని బిల్‌ గేట్స్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు.  ‘‘ఎవరైనా సరే విస్మరించడానికి వీల్లేని భారీ అవకాశాలున్న బ్రహ్మాండమైన మార్కెట్‌ భారత్‌ అని చెప్పారు.



వృద్ధికి ఢోకా లేదు: ‘‘భారత వృద్ధికి ఢోకా లేదు. తలసరి ఆదాయం వేగంగా పెరిగే విషయంలోనూ సందేహం లేదు’’ అని కూడా బఫెట్‌ స్పష్టం చేశారు. మన దేశంలో తలసరి ఆదాయం 2015–16లో రూ.1.06 లక్షల కోట్లు ఉండగా 2031–32 నాటికి రూ.3.14 లక్షల కోట్లకు పెరుగుతుందన్న నివేదికలున్న విషయం తెలిసిందే.



గూగుల్‌ బస్‌ మిస్‌

బఫెట్‌ గతంలో పెట్టుబడులకు సంబంధించి తాను చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందారు. ఐబీఎంకు బదులు గూగుల్‌ లేదా అమేజాన్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందంటూ బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే 53వ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. బెర్క్‌షైర్‌ బీమా విభాగం.. ‘గీకో’ ప్రకటనల ప్రదర్శనకు గూగుల్‌ ఒక్కో క్లిక్‌కు 10, 11 డాలర్ల చార్జీ వసూలు చేసినప్పుడే అందులో పెట్టుబడులు పెడితే బాగుం డేదన్నారు.


టెక్నాలజీ స్టాక్స్‌ను విస్మరించడంపైనా విచారం వ్యక్తం చేశారు. వాటి విలువను మొదట్లోనే గుర్తించలేకపోయినట్టు చెప్పారు. అజిత్‌ జైన్‌ బెర్క్‌షైర్‌ కి తన కంటే ఎక్కువే ఆదాయాన్ని తెచ్చి పెట్టారని.. ఆయన కంపెనీని వీడినా, రిటైర్‌ అయినా అతని స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top