
భారత్ విదేశీ రుణ భారం 485.6 బిలియన్ డాలర్లు
భారత్ విదేశీ రుణ భారం 2016 మార్చి నాటికి 485.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం 2016 మార్చి నాటికి 485.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే ఇదే సమయంతో పోల్చితే ఇది 2.2 శాతం (10.6 బిలియన్ డాలర్లు) పెరిగింది. దీర్ఘకాల రుణ భారం ప్రత్యేకించి ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల రూపంలో పెరిగింది. వార్షికంగా ఇది 3.3 శాతం పెరిగి 402.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఒక నివేదిక తెలిపింది.
స్వల్పకాలిక రుణ భారం 2.5 శాతం తగ్గి 83.4 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. వాణిజ్య సంబంధ రుణాలు తగ్గడం దీనికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. విదేశీ రుణ భారం నిర్వహణ స్థాయిలోనే ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచబ్యాంక్ కూడా ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విదేశీ రుణ భారం వల్ల ఒత్తిడులు ఎదుర్కొనే విషయంలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్ పరిస్థితి బాగుందన్నది ఈ నివేదిక సారాంశం.