2020 కల్లా 5జీ టెక్నాలజీ రెడీ..

India looking to position itself as a leader in 5G technology

పరిశోధనల్లో తోడ్పాటుకు రూ.500 కోట్లు

అత్యున్నత స్థాయి ఫోరం ఏర్పాటు 

టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా వెల్లడి

న్యూఢిల్లీ: మరింత వేగవంతమైన వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2020 నాటికల్లా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుంది. టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా మంగళవారం ఈ విషయాలు చెప్పారు.

‘దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి అనుగుణంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరాన్ని ఏర్పాటు చేశాం. 2020లో ప్రపంచదేశాలకు దీటుగా భారత్‌ కూడా దీన్ని అందుబాటులోకి తేగలదని విశ్వసిస్తున్నాం‘ అన్నారాయన. 3జీ, 4జీ టెక్నాలజీల్లో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ప్రభుత్వం చేజార్చుకుందని, కానీ 5జీ ప్రమాణాలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని మంత్రి చెప్పారు.

అంతర్జాతీయ సంస్థలతో పోటీపడేలా దీటైన ఉత్పత్తుల అభివృద్ధి, తయారీకి భారత్‌ కృషి చేస్తుందన్నారు. తద్వారా దేశీయంగా 50 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకునే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్లు మనోజ్‌ సిన్హా చెప్పారు. ’5జీ ఇండియా 2020 ఫోరం’లో టెలికం విభాగం కార్యదర్శి అరుణ సుందరరాజన్, ఐటీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ సాహ్నీ, శాస్త్ర..సాంకేతిక విభాగం కార్యదర్శి అశుతోష్‌ శర్మతో పాటు టెక్నాలజీ నిపుణులు ఉంటారు.

10,000 ఎంబీపీఎస్‌ స్పీడ్‌..: 5జీ  అందుబాటులోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 10,000 మెగాబిట్‌ పర్‌ సెకన్‌ (ఎంబీపీఎస్‌), గ్రామీణ ప్రాంతాల్లో 1,000 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ సేవలు అందించవచ్చని సిన్హా తెలిపారు. వచ్చే ఏడాది మధ్య నాటికి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ 5జీ ప్రమాణాలను ఖరారు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలోను, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు మొదలైన వాటికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ట్రాయ్‌ గణాంకాలమేరకు రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌ ద్వారా 18 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా సేవలు అందిస్తోంది.

5జీ నెట్‌వర్క్‌ సిద్ధం: ఎయిర్‌టెల్‌
వేగవంతమైన 5జీ సేవలు అందించేందుకు అనువైన టెక్నాలజీని ఇప్పటికే తాము అందుబాటులోకి తెస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌లకు ఉపయోగపడే ఎంఐఎంవో(మాసివ్‌ మల్టిపుల్‌ ఇన్‌పుట్‌ మల్టిపుల్‌ అవుట్‌పుట్‌) టెక్నాలజీని తొలుత బెంగళూరు, కోల్‌కతాలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కొత్త టెక్నాలజీ ప్రస్తుత నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని 5–7 రెట్లు పెంచగలదని, 2–3 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ అందించగలదని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కస్టమర్లు టారిఫ్‌ ప్లాన్లను, ఫోన్లను మార్చాల్సిన అవసరం లేకుండా తమ 4జీ ఫోన్లలోనే మరింత వేగవంతమైన డేటా సేవలు పొందవచ్చని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top