కోవిడ్‌-19 తదుపరి భారత్‌ భలే స్పీడ్‌

India leads after Covid-19 - Sakshi

ప్రస్తుతం బుల్‌ మార్కెట్‌లో ఉన్నాం

రెండు నెలల్లో రెండేళ్ల బుల్‌-బేర్‌ రన్‌

రియల్‌ ఎకానమీ కంటే ఫైనాన్షియల్‌ మార్కెట్లే ముందు

రినైసన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ అంచనాలు

ప్రస్తుతం భూగోళాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 తదుపరి ప్రపంచ దేశాలలో భారత్‌ అత్యంత వేగవంత వృద్ధిని అందుకోనున్నట్లు రినైసన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకులు పంకజ్‌ మురార్కా అంచనా వేస్తున్నారు. వివిధ రంగాలలో నాయకత్వ స్థాయిలో ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడం మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్ల తీరు, పెట్టుబడి వ్యూహాలు తదితర పలు అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. 

కేంద్ర బ్యాంకుల దన్ను
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ సహాయక ప్యాకేజీలు అమలు చేస్తుండటంతో ఫైనాన్షియల్‌ మార్కెట్లకు జోష్‌వచ్చింది. దీంతో రియల్‌ ఎకానమీ కంటే ముందుగానే స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు దన్నుగా పలు సంస్కరణలకు తెరతీశాయి. వీటికి జతగా కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ చర్యలు ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు తొలి దశ గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయంగా ఏడాది ద్వితీయార్థంలో ఇలాంటి పరిస్థితి నెలకొనవచ్చు. అయితే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ చర్యల కారణంగా స్టాక్‌ మార్కెట్లు బుల్‌ పరుగు తీస్తున్నాయి. కోవిడ్‌కు ముందు పరిస్థితితో పోలిస్తే ఇండియా మరింత బలంగా పుంజుకునే వీలుంది. తద్వారా ప్రపంచ దేశాలలోనే అత్యంత వేగవంత వృద్ధి సాధించగల దేశంగా నిలిచే అవకాశముంది.

దేశీ డిమాండ్‌
ఇటీవలి మూడు నెలల పరిస్థితులను పక్కనపెడితే.. గత రెండేళ్లుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు బేర్‌ దశను చవిచూశాయి. సాధారణంగా బేర్‌ ట్రెండ్‌ 12-24 నెలల కాలం కొనసాగుతుంది. అయితే గత రెండు నెలల్లోనే రెండేళ్ల బేర్‌ మార్కెట్‌ పరిస్థితులను మార్కెట్లు కళ్లజూశాయి. ప్రస్తుతం మార్కెట్‌ బుల్‌ ట్రెండ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థను గమనిస్తే.. కొన్ని బిజినెస్‌లకు సమస్యలు తప్పకపోవచ్చు. రానున్న రెండు, మూడు క్వార్టర్లలో ఆటో, రిటైల్‌ తదితర కొన్ని రంగాలకు సవాళ్లు ఎదురుకావచ్చు. అయితే పరిస్థితులు సాధారణస్థితికి చేరుకుంటే  ఈ రంగాలు జోరందుకోవచ్చు. దేశీయంగా బిజినెస్‌లు కలిగిన, ఆయా రంగాలలో నాయకత్వ స్థాయిలో ఉన్న కంపెనీలను ఎంచుకోవడం లబ్ది చేకూర్చగలదని భావిస్తున్నాం. ఉదాహరణకు ఆటో రంగంలో భారత్‌ ఫోర్జ్‌, సుందరం ఫాజనర్స్‌వంటివి ప్రస్తావించవచ్చు. ఇక మల్టీప్లెక్స్‌ కంపెనీ పీవీఆర్‌.. మరికొంతకాలం సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. 

టెలికం, టెక్నాలజీ
కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో టెక్నాలజీ, టెలికం రంగాలు విజేతలుగా ఆవిర్భవిస్తున్నాయి. టెలికం రంగంలో బాండ్‌విడ్త్‌ వినియోగం భారీగా పెరిగింది. సగటు వినియోగాన్ని పోలి టెక్నాలజీ వాడకం కూడా ప్రతీరోజూ వేగమందుకుంటోంది. ఇకపైన కూడా ఈ రెండు రంగాలూ ముందు వరుసలో నిలుస్తాయని భావించవచ్చు. వెరసి ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వవచ్చు.

ఎయిర్‌లైన్స్‌కు నో
గత 15 ఏళ్ల కాలంలో విమానయాన రంగంలో పెట్టుబడులకు సంబంధించి మాకు వైఫల్యాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ రంగంపై విదేశీ పరిస్థితులు, తదితర పలు బాహ్య సంబంధ అంశాలు ప్రభావం చూపుతుంటాయి. దీంతో యాజమాన్య నియంత్రణను దెబ్బతీస్తుంటాయి. ఇంధన ధరలు, రూపాయి మారకం, విదేశీ పరిస్థితులు కంపెనీల నిర్వహణను ప్రభావితం చేస్తుంటాయి. దీంతో కోవిడ్‌-19 వంటి పరిస్థితులలో ఈ రంగం కంటే ఇతర రంగాలపై దృష్టిసారించడం మేలని భావిస్తున్నాం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top