రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

India Inc wants Rs 1 lakh cr stimulus package - Sakshi

అప్పుడే పెట్టుబడులు, వృద్ధి పుంజుకుంటాయి

కేంద్ర ప్రభుత్వానికి పారిశ్రామిక వేత్తల సూచన

న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది.  దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ బీకే గోయంకా పేర్కొన్నారు.

‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ తెలిపారు. స్టీల్, ఎన్‌బీఎఫ్‌సీ, వాహన రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పిన ఆయన వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు.  

లిక్విడిటీ సమస్య లేదు...
పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్‌బీఎఫ్‌సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్‌ పిరమల్‌ వెల్లడించారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్‌లోన్, ఎంఎస్‌ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్‌ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్‌ పిరమల్‌ వెల్లడించారు.

దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్‌ ప్రెసిడెంట్‌ టీవీ నరేంద్రన్‌ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో మాంద్యం స్టీల్‌ రంగంపైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్‌ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్‌బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top