కుటుంబ వ్యాపారాల్లో భారత్‌ మేటి

India is good in family businesses - Sakshi

న్యూఢిల్లీ: కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయి. కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలు సంఖ్యా పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివరాలను ‘క్రెడిట్‌ సూసీ ఫ్యామిలీ 1000, 2018’ నివేదిక పేరుతో క్రెడిట్‌ సూసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసింది. భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (మార్కెట్‌ విలువ) 839 బిలియన్‌ డాలర్లు. చైనాలో 159 సంస్థలు, అమెరికాలో 121 సంస్థలు ఇలా కుటుంబ వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి.

ఇవి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌ మినహా ఆసియా ప్రాంతంలో చైనా, భారత్, హాంగ్‌కాంగ్‌ కుటుంబ వ్యాపారాల విషయంలో ముందున్నాయి. ఈ మూడు దేశాలే 65 శాతం వాటా ఆక్రమించాయి. ఈ మూడు దేశాల్లోని కుటుంబ వ్యాపారాల మార్కెట్‌ విలువ రూ.2.85 లక్షల కోట్ల డాలర్లు. 43 కంపెనీలతో (మార్కెట్‌ క్యాప్‌ 434 బిలియన్‌ డాలర్లు) దక్షిణ కొరియా నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్సీన్స్, థాయిలాండ్‌ 26 కంపెనీల చొప్పున కలిగి ఉన్నాయి. జపాన్‌ మినహా ఆసియా ప్రాంతంలో 11 దేశాలను ఈ నివేదిక కవర్‌ చేసింది. ఈ 11 దేశాలు మొత్తం విశ్వంలోని కుటుంబ వ్యాపారాల్లో 53 శాతం వాటాను ఆక్రమించాయి. మొత్తం మార్కెట్‌ క్యాప్‌ 4 లక్షల కోట్ల డాలర్లు.  

పోటీ సంస్థల కంటే అధిక రాబడులు...
‘‘ఈ ఏడాది ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ రంగంలోనూ కుటుంబాల నిర్వహణలోని వ్యాపారాలు చక్కని పనితీరుతో పోటీ సంస్థల కంటే ముందున్నట్టు గుర్తించాం. కుటుంబ వ్యాపారాలు బయటి నిధులపై తక్కువ ఆధారపడతాయని, పరిశోధన, అభివృద్ధిపై మరిన్ని నిధులు వెచ్చిస్తాయన్న దీర్ఘకాలిక దృక్పథాన్ని ఇది తగ్గిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడిట్‌ సూసీ నివేదిక ప్రధాన రూపకర్త యూజీన్‌ క్లెర్క్‌ పేర్కొన్నారు. మన దేశంలోని కుటుంబ వ్యాపార కంపెనీల షేర్ల రాబడి 2006 నుంచి ఏటా సగటున 13.9 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో వీటికి పోటీనిచ్చే స్థానంలో ఉన్న కుటుంబేతర వ్యాపార కంపెనీల షేర్లపై రాబడులు వార్షికంగా 6 శాతం వరకే ఉండడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top