లోను కావాలా గురూ..! | Heavy rising retail loans | Sakshi
Sakshi News home page

లోను కావాలా గురూ..!

May 1 2018 12:22 AM | Updated on May 1 2018 12:22 AM

Heavy rising retail loans - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్లకు భారీగా రుణాలిచ్చి అవి వసూలు కాక సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు సామాన్యుల వెంట పడ్డాయి. బ్యాంకుల కొత్త వ్యాపారంలో సింహభాగం రిటైల్‌ రుణాలే ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 16 నాటికి చూస్తే పెరిగిన బ్యాంకుల వ్యాపారంలో 96 శాతం వ్యక్తిగత రుణాలు (పర్సనల్‌ లోన్స్‌) కావడం గమనార్హం.

2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల రుణాల వ్యాపారంలో 41.5 శాతం వ్యక్తిగత రుణాలేనని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్‌ రుణాలు ఇప్పుడు ఎన్‌పీఏలుగా మారినట్టే... భవిష్యత్తులో రిటైల్‌ రుణాల నుంచి ఇదే మాదిరి రిస్క్‌ ఉండొచ్చని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విశ్వనాథన్‌ తాజాగా హెచ్చరించడం ఇందుకేనేమో. పారిశ్రామిక డిమాండ్‌ తగ్గినందున కార్పొరేట్‌ రంగం నుంచి తాజా పెట్టుబడులు లేని పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గణాంకాలు ఇవి...
2017 ఏప్రిల్‌ నుంచి 2018 ఫిబ్రవరి 16 వరకు పదిన్నర నెలల కాలంలో బ్యాంకుల నాన్‌ ఫుడ్‌ రుణాలు (ఆహారోత్పత్తి కోసం కాకుండా ఇచ్చేవి) రూ.2.44 లక్షల కోట్లుగా ఉంటే ఇందులో రూ.2.34 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే. ఈ ప్రకారం చూస్తే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల వ్యాపారంలో వృద్ధి 17.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ కాలంలో పరిశ్రమలకు ఇచ్చే రుణాలు రూ.5.28 లక్షల కోట్ల మేర తగ్గగా, వ్యవసాయం, అనుబంధ రంగాల రుణాల్లో రూ.2.44 లక్షల కోట్ల మేర వృద్ధి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నాన్‌ ఫుడ్‌ రుణాలు రూ.5.48 లక్షల కోట్లు కాగా, అందులో రూ.2.61 లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలే ఉండడం గమనార్హం. ‘పర్సనల్‌ లోన్స్‌’ అంటే వినియోగ ఉత్పత్తుల కొనుగోలుకు ఇచ్చేవి, వాహన రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్‌ కార్డు, ఎఫ్‌డీలు, షేర్లపై ఇచ్చే రుణాలు అన్నీ.  

విశ్లేషకులు ఏమంటున్నారు?  
‘‘ఇదేమీ ఆశ్చర్యపరిచే విషయం కాదు. కార్పొరేట్లు రుణాలు తీసుకోవడం దాదాపుగా ఆపేశాయి. దీంతో బ్యాంకులకు ఇప్పుడు వృద్ధికి అవకాశం ఉన్న ఏకైక విభాగం రిటైల్‌ రుణాలే. ఇదే పరిస్థితి మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుంది. ఎందుకంటే పారిశ్రామిక రుణాలకు తగిన డిమాండ్‌ లేదిప్పుడు. సేవల రంగం వృద్ధి కారణంగా వ్యక్తులు రుణాలు తీసుకుంటూనే ఉన్నారు’’ అని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధనుంజయ్‌ సిన్హా తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి గణాంకాలు బయటకు వస్తే రిటైల్‌ రుణాల వాటా తగ్గొచ్చని ఈక్వినామిక్స్‌ ఎండీ జి.చొక్కలింగం పేర్కొన్నారు. చారిత్రకంగా చూస్తే ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో (జనవరి–మార్చి) పారిశ్రామిక, ఇనిస్టిట్యూషనల్‌ రుణాల్లో పెరుగుదల ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కొంత కాలానికి తయారీరంగంలో సామర్థ్యం వినియోగం పుంజుకుంటే తాజా పెట్టుబడులకు మళ్లీ పరిస్థితులు అనుకూలిస్తాయని ఇండియా రేటింగ్స్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ హెడ్‌ దేవేంద్ర పంత్‌ అభిప్రాయపడ్డారు.

మరికొందరు నిపుణులు మాత్రం గృహస్తుల రుణాలు పెరిగిపోతున్నాయని, వారి వ్యక్తిగత ఆదాయంలో వృద్ధి 5–6 శాతం కంటే తీసుకునే వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 18–20 శాతం ఉంటోందని చెబుతున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులకు ఈ రుణాలు సమస్యగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement