రూ.2 లక్షలపైన వస్తు, సేవల కొనుగోళ్లపై 1% పన్ను | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షలపైన వస్తు, సేవల కొనుగోళ్లపై 1% పన్ను

Published Wed, Jun 1 2016 12:42 AM

రూ.2 లక్షలపైన వస్తు, సేవల కొనుగోళ్లపై 1% పన్ను

న్యూఢిల్లీ:  రెండు లక్షలపైన వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై ఇకపై ఒకశాతం పన్ను భారం పడనుంది. ఆభరణాలకు సంబంధించి మాత్రం ఒకశాతం పన్ను రూ.5 లక్షలపైన కొనుగోళ్లపై ఉంటుంది. అయితే బులియన్‌కు సంబంధించి మాత్రం ఒకశాతం పన్నుకు రూ.2 లక్షల పరిమితి వర్తిస్తుంది. సోర్స్ (టీసీఎస్) వద్ద అమలయ్యే ఈ ఒకశాతం పన్ను నిర్ణయం జూన్ 1 నుంచీ అమల్లోకి వస్తుంది. పసిడి, ఆభరణాలకు సంబంధించి సోర్స్ వద్ద ఒకశాతం పన్ను 2012 జూలై 1 నుంచీ అమలవుతోందని, ఇదే పరిస్థితి ఇకముందూ అమలవుతుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.

2016-17 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వస్తు, సేవల నగదు కొనుగోళ్లపై తాజా ఒకశాతం పన్ను అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆప్షన్ అమ్మకాలపై కూడా జూన్ 1 నుంచీ పెంచిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) 0.05 శాతం (0.017 శాతం నుంచి) అమలవుతుందని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది. రూ. 10 లక్షలు పైబడిన లగ్జరీ కార్ల కొనుగోళ్లపై కూడా సోర్స్ వద్ద ఒకశాతం పన్ను విధించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.

Advertisement
Advertisement