భయపెడుతున్న ద్రవ్యోల్బణం!

Government to keep an eye on inflation through new index - Sakshi

పెరిగిపోతున్న ముడి చమురు ధరలు

రూపాయి పతనంతో సవాళ్లు

ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమే

ఆర్‌బీఐ పాలసీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు  

సాక్షి, బిజినెస్‌ విభాగం : పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి విలువ పతనం వెరసి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి సవాల్‌గా మారనున్నాయి. ఫలితంగా అతి త్వరలోనే ఆర్‌బీఐ కీలక రేట్లను పెంచే దిశగా అడుగులు  వేయవచ్చన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయమే మిగిలి ఉన్న తరుణంలో తాజా పరిస్థితి కేంద్ర సర్కారును ఇరుకున పెట్టేదే అనడంలో సందేహం లేదు.

ప్రధానంగా ముడి చమురు దిగుమతులపై భారీగా వెచ్చిస్తున్న మన దేశానికి అంతర్జాతీయంగా ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదన్న విశ్లేషణలు ఆందోళనకు గురిచేసేవే. వెనెజులాలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం, ఇరాన్‌ విషయంలో అమెరికా ఆంక్షలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా బ్రెండ్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ర్యాలీ చేస్తోంది. ఇది ప్రస్తుతం 76 డాలర్ల స్థాయికి చేరుకుంది. 2014 నవంబర్‌ తర్వాత ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం.

దేశీయ రిఫైనరీలు కొనుగోలు చేసే ధరపై ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మరోవైపు ఈ పరిణామాలతో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 15 నెలల కనిష్ట స్థాయి 67.13కు దిగిపోయింది. రూపాయి పతనం ఇంకా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ఇండియా రేటింగ్స్‌ సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌ దేవేంద్ర పంత్‌ మాట్లాడుతూ... దీర్ఘకాలం పాటు చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు అననుకూలంగా పేర్కొన్నారు.

‘‘పెరిగే ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తే అది ద్రవ్యోల్బణ ప్రభావానికి దారితీస్తుంది. దీంతో ఆర్‌బీఐ రేట్ల విషయంలో కీలకంగా భావించే గృహ ద్రవ్యోల్బణంపై గణనీయంగా ప్రభావం చూపుతుంది’’ అని పంత్‌ చెప్పారు. ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో ఈ విధమైన అంశాలను ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ద్రవ్యలోటూ కీలకమే
ద్రవ్యలోటు కూడా కీలకమేనని దేవేంద్ర పంత్‌ పేర్కొన్నారు. 2018–19లో ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యాన్ని తప్పితే మానిటరీ పాలసీ కఠినానికి దారితీస్తుందని అభిప్రాయం తెలిపారు. క్రూడాయిల్‌ ధరలు పెరగడం దేశీయంగా ట్విన్‌ బ్యాలన్స్‌ షీట్ల సమస్యపై మరింత ఒత్తిడి పెంచుతుందని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కూడా పెరుగుతాయని యస్‌ బ్యాంకు చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుబధరావు చెప్పారు.

బలపడుతున్న డాలర్‌...
గత వారం రోజుల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం రూపాయిని బలహీనపరిచింది. కీలక నిరోధ స్థాయి 92ను దాటి 92.9 గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత కొంచెం దిగొచ్చినప్పటికీ బుల్లిష్‌గానే ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో డాలర్‌ ఇండెక్స్‌ 93.5 స్థాయి వరకు వెళ్లొచ్చని, అదే జరిగితే రూపాయి స్వల్ప కాలంలో మరింత క్షీణతకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) వరుసగా డెట్‌ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. గడిచిన మూడు వారాల్లో 2.6 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను డెట్‌ మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నారు. డెట్‌ విభాగంలో ఎఫ్‌పీఐలు నికర విక్రయందారులుగా ఉన్నంత కాలం రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

రూపాయి బలహీనం
కీలకమైన మద్దతు స్థాయి 66.90–67ను రూపాయి కోల్పోయింది. కనుక ఈ స్థాయిలు మళ్లీ రూపాయికి నిరోధంగా మారతాయన్నది విశ్లేషణ. రూపాయి 67కు దిగువనే కొనసాగితే స్వల్ప కాలంలో 67.40 వరకు క్షీణిస్తుందని, ఆ తర్వాత 68.3 స్థాయికీ పడే అవకాశం ఉంటుందని విశ్లేషకుల అంచనా.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top