
న్యూఢిల్లీ: నిర్దిష్ట వెబ్‌సైట్లను ఉపయోగించే వారి పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని, వాటిని తక్షణమే మార్చుకోవాలని భారత్‌లోని యూజర్లను టెక్ దిగ్గజం గూగుల్ అప్రమత్తం చేసింది. మీడియా సంస్థలు మొదలుకుని సామాన్య యూజర్ల దాకా చాలా మంది ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మొబైల్ స్క్రీన్‌లపై గురువారం ఈ మేరకు నోటిఫికేషన్లు ప్రత్యక్షమయ్యాయి. డేటా లీకేజీ కారణంగా పాస్‌వర్డ్‌లు చోరీకి గురై ఉంటాయని వీటిల్లో గూగుల్ పేర్కొంది.
ఆహారోత్పత్తులు విక్రయించే ఫ్రెష్‌హోమ్ అనే ఈ–కామర్స్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా వార్నింగ్ పాప్ అప్ వచ్చినట్లు ఓ యూజరు వెల్లడించారు. అలాగే తమ గ్రూప్‌నకు చెందిన ఓ పోర్టల్‌లో లాగిన్ అయ్యే క్రమంలో ఇలాంటి నోటిఫికేషన్ ప్రత్యక్షమైనట్లు ఓ మీడియా సంస్థ వర్గాలు తెలిపాయి. క్రోమ్ 79లో బగ్‌ను గూగుల్ అతికష్టం మీద సరిచేయగా ఇంతలోనే మళ్లీ పాస్‌వర్డ్‌ల చోరీ అలర్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాస్‌వర్డ్‌లకు మరింత భద్రత కల్పించే విధంగా క్రోమ్ 79 బ్రౌజరును గూగుల్ తీర్చిదిద్దింది.